పొలిటికల్ హై ఓల్టేజ్ థ్రిల్లర్ హుజురాబాద్‌లో ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది.. హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2లక్షల 36వేల 283 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు లక్షా 17 వేల 563. మహిళా ఓటర్లు లక్ష18 వేల 719 మంది. ఎన్నికల నిర్వహణ కోసం 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనల మధ్య ఓటింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. రాత్రి 7 గంటల వరకూ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
ఈవీఎంలలో మొత్తం 421 కంట్రోల్ యూనిట్లు, 891 బ్యాలెట్ యూనిట్లు, 515 వివిప్యాట్లను వినియోగిస్తున్నారు.. మొత్తం 1715 మంది పోలింగ్ సిబ్బంది బైపోల్ విధుల్లో బాగం పంచుకుంటున్నారు. హుజురాబాద్ జూనియర్ కాలేజిలో ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేసారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సిబ్బంది అందరూ కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసుల టీకా తీసుకున్నారని అధికారులు చెబుతున్నారు. ఇక, పోలింగ్ సందర్భంగా నియోజకవర్గంలో మద్యం షాపులు, మద్యం విక్రయించే హోటల్స్, రెస్టారెంట్లు, క్లబ్బులు మూసి వేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అభ్యర్థులు పబ్లిక్ లేదా ప్రైవేట్ స్థలాలలో 100 మీటర్లలోపు, పోలింగ్ స్టేషన్లకు 200 మీటర్లలోపు ఎలాంటి ప్రచారం చెయ్యకూడదు. నియోజకవర్గంలో ఓటర్లందరికీ స్లిప్పులు పంపిణీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా వెంట తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
ఇక, పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశారని పోలీసులు తెలిపారు. అసాంఘిక శక్తులుగా భావించిన వారిని బైండోవర్ చేశామని.. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 3,865 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలను హుజురాబాద్ రప్పించారు. మొత్తం 30మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో రెండు ఈవీఎంలను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఇబ్బందిలేకుండా అదనంగా 279 బ్యాలెట్లను సిద్ధం చేశారు. అన్ని చోట్ల వెబ్ కాస్టింగ్‌తో పోలింగ్ కేంద్రాన్ని రికార్డ్ చేసేందుకు ఇంజినీరింగ్ విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణనిచ్చారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికే పోలింగ్ డ్యూటీ వేశారు. 306 పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 7 వరకు పోలింగ్ జరగనుండటంతో చీకటి పడిన తర్వాత విద్యుత్ సమస్య తలెత్తినా.. ఎలాంటి అవాంతరం లేకుండా ఉండేందుకు సోలార్ ల్యాంప్‌లు, చార్జింగ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు.