Site icon NTV Telugu

తమిళనాడులో ఒకవైపు వర్షాలు.. మరోవైపు భూకంపం.. వణికిపోతున్న ప్రజలు

తమిళనాడులోని వెల్లూరులో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీంతో పలుచోట్ల భూమి బీటలు వారడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దీంతో నిద్రపోతున్న ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 3.6గా తీవ్రత నమోదైందని అధికారులు వెల్లడించారు. వెల్లూరుకు 59 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉందని వారు తెలిపారు. భూ అంతర్భాగంలో 25 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలాజీ అధికారులు పేర్కొన్నారు. అయితే భూకంపం వల్ల సంభవించిన నష్టం ఎంతో తెలియాల్సి ఉందన్నారు.

Read Also: ఏఆర్ రెహమాన్‌ కు అరుదైన గౌరవం

అసలే ఓ వైపు భారీ వర్షాలతో తమిళనాడు ప్రజలు అతలాకుతలం అవుతుంటే… ఇప్పుడు భూకంపంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. వెల్లూరులో ఇటీవల భారీ వర్షాలు కురిసిన కారణంగా ప్రాజెక్టులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చెక్‌డ్యామ్‌లు, లోలెవల్ బ్రిడ్జిలపై నుంచి వరదనీరు పోటెత్తడంతో ప్రజలు అవస్థలకు గురవుతున్నారు. పాలార్ నదికి వరద ఉధృతి కారణంగా పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇలా ఒకవైపు వర్షాలు.. మరోవైపు భూకంపంతో ప్రజలు వణికిపోతున్నారు.

Exit mobile version