చిత్రసీమలో రాణించాలని కలలు కనేవారు ఎందరో! తమ కలలను సాకారం చేసుకొని చిత్రసీమలో అలరించేవారు కొందరే! అలా ఎందరో ప్రతిభావంతులు తమదైన బాణీ పలికిస్తూ తెలుగు సినిమా రంగంలోనూ రాణిస్తున్నారు. కోరుకున్న తీరాలను చేరుకొని ఆనందిస్తున్నారు. అలాంటి వారిలో దర్శకుడు కొరటాల శివ ఒకరు. సినిమా రంగంలో దర్శకునిగా రాణించాలనే ఆయన కలలు కంటూ చిత్రసీమలో అడుగుపెట్టారు. ఆరంభంలో రచయితగా అలరించన కొరటాల శివ ‘మిర్చి’ సినిమాతో దర్శకుడయ్యారు. తొలి చిత్రంతోనే జయకేతనం ఎగరేశారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ తెరకెక్కించారు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ‘ఆచార్య’ మే 13నే జనం ముందు నిలచిఉండేది. కరోనా రెండో దశ విజృంభణతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. సక్సెస్ రూటులో సాగుతున్న కొరటాల శివ, చిరంజీవి అంతటి టాప్ స్టార్ తో ‘ఆచార్య’ను ఎలా తెరకెక్కించి ఉంటారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సినిమా రంగంలో రాణించాలంటే గుమ్మడి కాయంత ప్రతిభ కన్నా, ఆవగింజంత అదృష్టం ఉండాలని అంటారు. కొరటాల శివకు తన ప్రతిభపై తనకు నమ్మకం ఉంది. ఇక అదృష్టం అంటారా, ప్రముఖ రచయిత పోసాని కృష్ణమురళికి శివ సమీపబంధువు. దాంతో మొదట్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసిన శివ, తరువాత పోసాని వద్ద అసిస్టెంట్ గా చేరి తన రచనతో ఆకట్టుకున్నారు. ఆ తరువాత సోలో రైటర్ గా సాగారు. “భద్ర, ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం, సింహా, ఊసరవెల్లి” వంటి చిత్రాలకు రచనలో పాలుపంచుకున్నారు శివ. అదే సమయంలో తన కలను సాకారం చేసుకొనేందుకు మరో వైపు సొంతగా సబ్జెక్ట్స్ రెడీ చేసుకున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆత్మీయులు యు.వి.క్రియేషన్స్ సంస్థను ప్రారంభించి, ప్రభాస్ తో ఓ భారీ చిత్రం నిర్మించాలని తలచారు. అదే సమయంలో కొరటాల శివ తన సబ్జెక్ట్ వినిపించారు. ప్రభాస్ ఇమేజ్ కు ఆ కథ అన్ని విధాలా సరిపోతుందని భావించారు నిర్మాతలు. అలా ‘మిర్చి’తో కొరటాల శివ దర్శకునిగా జనం ముందు నిలిచారు. ‘ఛత్రపతి’ తరువాత ఆ స్థాయి సక్సెస్ మళ్ళీ ప్రభాస్ దరి చేరలేదనుకుంటున్న సమయంలో ‘మిర్చి’ అనూహ్య విజయాన్ని అందించింది. ఆ సినిమా ఘనవిజయంతో కొరటాల శివతో కలసి పనిచేసేందుకు టాలీవుడ్ టాప్ స్టార్స్ ఆసక్తి చూపించారు. అలా రెండో సినిమాతోనే మహేశ్ లాంటి టాప్ స్టార్ తో పనిచేసే అవకాశం లభించింది. మహేశ్ తో కొరటాల తెరకెక్కించిన ‘శ్రీమంతుడు’ కూడా ఘనవిజయం సాధించింది. ఆ సినిమా ఘనవిజయం తరువాత మహేశ్, కొరటాలకు ప్రత్యేకంగా ఓ లగ్జరీ కారును బహుమతిగా అందించారు. దీనిని బట్టే కొరటాల స్టామినా ఏంటో టాలీవుడ్ స్టార్స్ కు మరింత బాగా అర్థమయింది. ఆ తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్ తో కొరటాల శివ తెరకెక్కించిన ‘జనతా గ్యారేజ్’తోనూ మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు శివ. అలా గ్రాండ్ సక్సెస్ లో హ్యాట్రిక్ చూసిన కొరటాల నాల్గవ చిత్రంగా ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని రూపొందించారు. మరోమారు శివతో కలసి మహేశ్ పనిచేసిన ఈ చిత్రం సైతం విజయపథంలోనే పయనించింది. నాలుగు భారీ విజయాలతో సాగిపోతున్న కొరటాల శివ, ఐదో చిత్రంతో మెగాస్టార్ చిరంజీవిని ‘ఆచార్య’గా మలిచే అవకాశం సంపాదించారు. ఈ సినిమా కోసమై జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కొరటాల శివ చిత్రాల్లో సమకాలీన సామాజికాంశాలను స్సృశిస్తూ కథలు సాగుతాయి. ఆ అంశాల్లో కొన్ని సమస్యలకు తనదైన రీతిలో పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తుంటారు కొరటాల. ఇక తన సినిమాల్లోని పాటల్లో ఏదో ఒక గీతం ఉత్తేజంగా సాగేలా శ్రద్ధ వహిస్తారు. ఆయన నాలుగు సినిమాల్లోనూ ఆ తరహా గీతాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం చిరంజీవితో కొరటాల తెరకెక్కించిన ‘ఆచార్య’లోనూ పాటల తీరు భలేగా సాగిందని చెప్పవచ్చు. ఆ సినిమా నుండి విడుదలైన పాటల్లో “లాహే లాహే…” అంటూ సాగే సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. సినిమాలోని ఇతర పాటలు సైతం కొరటాల శివ మార్కుతో రూపొంది అలరిస్తాయని సినీఫ్యాన్స్ అభిలాష!
ఈ ఐదో చిత్రంతోనూ కొరటాల శివ ఘనవిజయం సాధిస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు ఏ తీరున జనం ముందు నిలుస్తుందో ఎలాంటి సక్సెస్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.