Site icon NTV Telugu

ఏఎస్సైని తాళ్లతో బంధించి చితకబాదారు.. ఎక్కడంటే?

మనం కొన్ని సీన్స్ సినిమాల్లో తరచూ చూస్తుంటాం. విలన్ గ్యాంగ్ ని కొట్టిన పోలీసులు.. ఎస్ఐ అయినా సీఐ అయినా ఆ తర్వాత రోడ్డుపైన అతడిని చితకబాదడం, దారుణంగా హతమార్చడం చేస్తుంటారు. అలాంటి రీల్ సీన్ రియల్ గా జరిగింది. ఓ గొడవను అడ్డుకునేందుకు వెళ్లిన ఓ ఏఎస్సైని తాళ్లతో బంధించి చితకబాదారు కొంతమంది యువకులు.

బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దాడి చేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంపారన్ జిల్లాలోని మోతిహరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధరమ్‌పుర గ్రామంలో ఘర్షణ జరుగుతోందని సమాచారం వచ్చింది. వెంటనే అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై సీతారాం దాస్ సంఘటనా స్థలానికి వెళ్ళారు.అక్కడ జూదం ఆడుతూ కనిపించారు కొందరు యువకులు.

ఏఎస్సైని చూస్తూనే వారంతా ఒక్కసారిగా రెచ్చిపోయారు. దీపావళినాడు పెట్రోలింగ్ ఏంటని ప్రశ్నిస్తూ దాడికి దిగారు. ఆయనను పట్టుకుని.. చేతులను తాళ్లతో వెనక్కి కట్టేశారు. ఆపై అందరూ కలిసి చితకబాదారు. ఈ ఘటన మొత్తాన్ని ఎవరో సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. బంధించిన ఏఎస్సైని యువకులు కాసేపటి తర్వాత విడిచిపెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Exit mobile version