NTV Telugu Site icon

కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యల్లో నిజమెంతా.. హుజురాబాద్‌లో గెలిచేది ఆ పార్టీనేనా..?

తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం హుజురాబాద్‌ ఉప ఎన్నిక మేనియా నడుస్తోంది. ఉప ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారంలో కొత్త వ్యూహ్యాలతో ప్రత్యర్థులపై మాటల బాణాలు సంధిస్తున్నారు. ఈనెల 30న హుజురాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ జరుగనున్న విషయం తెలిసిందే. మరో మూడు రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉంది. ప్రస్తుతం ఉప ఎన్నికల బరిలో 30 అభ్యర్థుల ఉన్నా ప్రముఖ పార్టీలు బీజేపీ తరుపున ఈటల రాజేందర్‌, టీఆర్‌ఎస్‌ తరుపున గెల్లు శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌ లు ఉన్నారు. ఎంతమంది అభ్యర్థులు ఉన్నా పోటీ మాత్రం బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్యే ఉండబోతోందని స్థానిక ప్రజలు అంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు చేసిన సర్వేల్లో కూడా ఇదే తేలింది.

అయితే ఇటీవల టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ హుజురాబాద్‌ ఉప ఎన్నికల బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి ఈటలపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు. ఈనెల 26న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. బీజేపీ, కాంగ్రెస్‌ ఒక్కటేనని.. ఈటల రాజేందర్‌, పీసీసీ రేవంత్‌ రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారని అందుకే హుజురాబాద్‌ లో కాంగ్రెస్‌ తరుఫున డమ్మీ క్యాండెట్‌ ను నిలిపారని, త్వరలోనే కాంగ్రెస్‌లోకి ఈటల చేరుతారని వ్యాఖ్యానించారు.

దీంతో బీజేపీ నేతలు హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయమని తెలిపోయిందని అందుకే ఇలాంటి నిందలు వేస్తున్నారని ఉద్ఘాటించారు. అంతేకాకుండా కేటీఆర్‌ తను చేసిన వ్యాఖ్యలు నిరూపించుకోవాలంటూ.. తన దగ్గర ఉన్న సాక్ష్యాలు బయట పెట్టాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దీనితో పాటు టీఆర్‌ఎస్‌ ఎక్కడ గెలవదో అక్కడికి కేటీఆర్‌ రాడు అంటూ దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఉదహరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ తరుఫున ట్రబుల్‌ షూటర్‌ హరీశ్‌ రావు వన్‌ మ్యాన్‌ షోగా హుజురాబాద్‌ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మండలానికి ఐదారుగురు ఎమ్మెల్యేలను, మంత్రులను పెట్టి గులాబి గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డుతున్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీలో క్రీయా శీలక పాత్ర పోషించే కేటీఆర్‌, హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఎందుకు రావడం లేదనే భావన హుజురాబాద్‌ ఓటర్ల మదిలో కూడా మెదులుతున్న ప్రశ్న.. ఈ విషయాన్నే ప్రత్యర్థి బీజేపీ నేతలు హుజురాబాద్‌ ఓటర్ల ముందు పెడుతూ ప్రచారంలో ముందుకు వెళుతున్నారు. కేటీఆర్‌ ఉప ఎన్నికకు ముందే ఈటల గెలుపు ఖాయమని నిశ్చయించుకున్నారా..? అనే ప్రశ్న స్థానిక నేతల మధ్య జరుగుతున్న సంభాషణ. ఏదేమైనా బీజేపీ నేతలు తమ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలుపును టీఆర్‌ఎస్‌ పార్టీ పరోక్షంగా ఒప్పకుందని అంటున్నారు.