NTV Telugu Site icon

నాన్న బాటలోనే నాగార్జున!

Nagarjuna

(ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు)
నటసమ్రాట్ ఏయన్నార్ వారసునిగా ‘యువసమ్రాట్’గా అడుగు పెట్టిన నాగార్జున తొలి నుంచీ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ వచ్చారు. అక్కినేని ఫ్యామిలీకి ప్రేమకథా చిత్రాలు అచ్చి వస్తాయని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే లవ్ స్టోరీగా రూపొందిన ‘విక్రమ్’తో హీరోగా జనం ముందు నిలిచారు నాగ్. ఆ తరువాత ‘మజ్ను’గానూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన పర్సనాలిటీకి తగ్గ కథలను ఎంచుకుంటూ ఏయన్నార్ అభిమానుల మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు. నాగార్జున సైతం అదే పంథాలో పయనిస్తూ “శివ, గీతాంజలి, అన్నమయ్య, శ్రీరామదాసు” వంటి విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించారు. తండ్రి ఏయన్నార్ “విప్రనారాయణ, భక్త తుకారాం, చక్రధారి” వంటి చిత్రాలలో భక్తునిగా ఎంతలా మెప్పించారో, అదే రీతిన నాగ్ సైతం భక్తుల పాత్రల్లో మురిపించారు. అంతేనా… అంతే అయితే అతను ‘కింగ్’ నాగార్జున ఎందుకవుతారు? తండ్రిలాగే తాను హీరోగా నటించిన సినిమాల ద్వారా, తాను నిర్మించిన చిత్రాలతోనూ పలువురికి చిత్రసీమలో స్థానం కల్పించారు నాగార్జున.

నాగార్జున ‘సంకీర్తన’ చిత్రంతోనే గీతాకృష్ణ దర్శకునిగా పరిచయం అయ్యారు. ‘శివ’ సినిమాతోనే రామ్ గోపాల్ వర్మ తొలిసారి మెగాఫోన్ పట్టిన విషయం అందరికీ తెలిసిందే. నాగార్జున ‘జైత్రయాత్ర’తోనే ఉప్పలపాటి నారాయణరావు దర్శకుడయ్యారు. తాను నిర్మించిన ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’ ద్వారా వైవిఎస్ చౌదరిని దర్శకునిగా పరిచయం చేసిందీ నాగార్జునే. ఆయన హీరోగా రూపొందిన ‘నువ్వు వస్తావని’తో వి.ఆర్. ప్రతాప్ దర్శకునిగా పరిచయం అయ్యారు. నాగార్జున ‘ఎదురులేని మనిషి’తో జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకునిగా అడుగుపెట్టారు. నాగ్ ‘సంతోషం’తో దశరథ్ దర్శకుడయ్యారు. తాను నిర్మించిన ‘మాస్’తో డాన్స్ కొరియోగ్రాఫర్ లారెన్స్ ను డైరెక్టర్ ను చేసింది నాగార్జునే. తన మేనల్లుడు సుమంత్ ను హీరోగా ‘ప్రేమకథ’తో పరిచయం చేసిందీ ఆయనే. అలాగే సుమంత్ హీరోగా రూపొందిన ‘సత్యం’తో సూర్యకిరణ్ కు దర్శకునిగా అవకాశం ఇచ్చిందీ ఆయనే. ఇలా నాగార్జున చిత్రాల ద్వారా వెలుగు చూసిన వారు తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోగలిగారు.

ప్రతి విషయంలోనూ తండ్రినే అనుసరిస్తూ వచ్చిన నాగార్జున, తండ్రి నెలకొల్పిన అన్నపూర్ణ సినీస్టూడియోస్ నిర్వహణలోనూ తనదైన బాణీ పలికిస్తున్నారు. బుల్లితెరపై ఏయన్నార్ ‘మట్టిమనిషి’గా నటించారు. అయితే నాగ్ మాత్రం బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్’ వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి మెప్పించారు. ప్రస్తుతం అక్కినేని నటవంశానికి నాగార్జునే పెద్దదిక్కు. తనయులతోనూ పోటీ పడుతున్న నాగార్జున ఆరు పదులు దాటినా, ఇంకా అలరిస్తూనే ఉన్నారు.