NTV Telugu Site icon

45 ఏళ్ళ ‘బంగారు మనిషి’

Bangaru Manishi

Bangaru Manishi

(ఆగస్టు 25తో ‘బంగారు మనిషి’కి 45 ఏళ్ళు పూర్తి)

నటరత్న యన్.టి.రామారావు నటించిన ‘బంగారు మనిషి’ మంచి కథ, కథనంతో జనాన్ని ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని త్రివేణి ప్రొడక్షన్స్ పతాకంపై పి. పేర్రాజు నిర్మించారు. అంతకు ముందు యన్టీఆర్ తో ‘బడిపంతులు’ వంటి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మించి విజయం సాధించిన పేర్రాజు, ఈ సినిమాలోనూ తన అభిరుచిని చాటుకున్నారు. ‘బంగారు మనిషి’ చిత్రానికి త్రివేణి ప్రొడక్షన్స్ యూనిట్ కథను సమకూర్చడం విశేషం. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.భీమ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇందులో లక్ష్మి నాయికగా నటించారు. దీనికంటే ముందు యన్టీఆర్, లక్ష్మి జోడీగా నటించిన ‘ఒకే కుటుంబం’ సినిమాకు కూడా భీమ్ సింగ్ దర్శకుడు కావడం గమనార్హం!

కలెక్టర్ ఆఫీసులో బిల్ల బంట్రోతుగా పనిచేసే వ్యక్తి తనయుడు అదే ఆఫీసుకు కలెక్టర్ గా రావడం, ఆ తండ్రీకొడుకుల మధ్య సాగే వృత్తిపరమైన అనుబంధం, వ్యక్తిగతమైన బంధం ‘బంగారు మనిషి’ చిత్రానికి ఆయువు పట్టుగా నిలిచాయి. బంట్రోతు కొడుకు వేణు, కలవారి అమ్మాయి గీత, అక్రమార్జనతో ధనవంతుడైన భానోజీరావు తనయుడు ప్రసాద్, అతని కూతురు పద్మ అందరూ కలసి చదువుకుంటారు. వేణు ఫస్ట్ క్లాస్ లో పాసయితే, ఇంటికి పిలిచి పార్టీ ఇస్తాడు ప్రసాద్. అతని తండ్రి భానోజీ, వేణును అవమానిస్తాడు. తరువాత అదే వేణు కలెక్టర్ అయి సొంతవూరిలోనే ఉద్యోగానికి వస్తే కూతురును ఇవ్వాలని చూస్తాడు భానోజీ. ఇక ఒకప్పుడు శ్రీమంతుల బిడ్డగా ఉన్న గీత, పరిస్థితుల ప్రభావం వల్ల కలెక్టర్ ఆఫీసులోనే క్లర్క్ గా పనిచేస్తూ ఉంటుంది. చదువుకొనే రోజుల్లో వేణుని ప్రేమించిన గీత, అతడు కలెక్టర్ కాగానే అపార్థం చేసుకుంటుంది. ఆ ఊరిలో భానోజీ అక్రమాలు చేస్తూ ఎలా ప్రజల ధనాన్ని కొల్లగొడుతున్నాడో తెలుసుకొని వేణు ఆట కట్టిస్తాడు. భానోజీ తనయుడు ప్రసాద్ సైతం మిత్రుడు వేణుకు సహకరిస్తాడు. చివరకు బ్లాక్ మార్కెటింగ్ చేసేవారిని చట్టానికి అప్పచెబుతారు. వేణు మనసు తెలుసుకున్న గీత ఆనందిస్తుంది.

‘బంగారు మనిషి’ చిత్రంలో గుమ్మడి, శ్రీధర్, హేమాచౌదరి, శరత్ బాబు, నిర్మలమ్మ, అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు, ప్రభాకర్ రెడ్డి, మిక్కిలినేని, గిరిజ, రమాప్రభ, పండరీబాయి, కె.వి.చలం, ముక్కామల, జయమాలిని తదితరులు నటించారు. ఈ చిత్రానికి గొల్లపూడి రచన చేయగా, సి.నారాయణరెడ్డి, కొసరాజు, దాశరథి పాటలు రాశారు. కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చారు.

ఇందులో సినారె రాసిన “నా దేశం భగవద్గీత… నా దేశం అగ్నిపునీత సీత…” అంటూ మొదలై “ఎక్కడికెళుతుందీ దేశం ఏమైపోతుంది…” పాట ఈ నాటికీ జనాన్ని ఆకట్టుకుంటూనే ఉంది. ఇక “మేలుకో వేణు గోపాలా…”, “కలగన్నాను…ఏదో కలగన్నాను…”, “ఇది మరో లోకం… ఇది అదో మైకం…”, “సుక్కేస్కోరా నాయనా…” వంటి పాటలు అలరించాయి. ‘బంగారు మనిషి’ చిత్రం మంచి విజయం సాధించి, శతదినోత్సవం చూసింది.