(జూన్ 19న ‘మౌనగీతం’కు 40 ఏళ్ళు పూర్తి)
విధి చేయు వింతలన్నీ మతిలేని చేతలేనని… అంటారు కానీ, ఆ వింత చేష్టలనే ‘విధి లీల’ అనీ చెబుతారు. సుహాసిని నటించిన తొలి చిత్రం ‘నెంజతై కిల్లాదే’. దీని అర్థం ‘మనసును గిల్లకు’ అని. ఈ సినిమాను తెలుగులో ‘మౌనగీతం’ పేరుతో అనువదించారు. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో ‘మౌనగీతం’గానూ అలరించింది. అలా ‘మౌనగీతం’తో సుహాసిని తెలుగువారిని పలకరించక ముందే ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం ‘కొత్తజీవితాలు’ విడుదలయింది. ఆ సినిమాలో సుహాసిని అందం ఆ నాటి కుర్రకారుకు బంధం వేసింది. దాంతో ఆమె తొలి చిత్రం ‘నెంజతై కిల్లాదే’ తెలుగులో ‘మౌనగీతం’గా అనువదించి జనం ముందు నిలిపారు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు ‘మౌనగీతం’ను విడుదల చేశారు. విజయం సాధించారు. ఈ చిత్రానికి మహేంద్రన్ దర్శకుడు. ఆ రోజుల్లో మహేంద్రన్ దర్శకత్వం గురించి జనం భలేగా ముచ్చటించుకున్నారు. ఇక చిత్రమేమంటే, సుహాసిని భర్త మణిరత్నం అంతకు ముందు నాలుగు చిత్రాలు రూపొందించినా, ఆయన తొలిసారి విజయాన్ని చవిచూసింది ‘మౌనరాగం’తోనే! అలా ‘మౌనం’తో సుహాసిని, మణిరత్నం ఇద్దరికీ అనుబంధం ఉంది. అంతేనా!? ‘మౌనగీతం’ కథలాగే ‘మౌనరాగం’ కూడా ఉంటుంది. అయితే, ఆ కథను ఇటు అటు చేసి మణిరత్నం మ్యాజిక్ చేశారని ఇప్పటికీ జనం అంటూనే ఉంటారు. మరి, అదే ‘విధిలీల’! ‘మౌనగీతం’ తెలుగునాట 1981 జూన్ 19న విడుదలయింది.
ఇదీ ‘మౌనగీతం’…
తన అన్నావదినలతో కలసి ఉంటుంది విజి. చాలా అల్లరి పిల్ల. ఆమెకు రాము అనే మెకానిక్ పరిచయమవుతాడు. విజి అన్న చంద్రశేఖర్ తన భార్యతో తరచూ గొడవ పడుతూ ఉంటాడు. విజికి, ఆమె వదినకు గొడవ జరుగుతుంది. వదిన స్నానం చేసే నీళ్ళలో కారం కలిపి సంబర పడుతుంది విజి. ఇక, విజి, రాము ప్రేమించుకుంటారు. పెళ్ళాడాలనుకుంటారు. విజి ఇంటికి రాము కన్నవారు వెళతారు. ఆ సమయంలో చంద్రశేఖర్, విజి ఇంట్లో ఉండరు. వారితో విజి మంచి అమ్మాయి కాదని, ఇప్పటికే అబార్షన్ చేయించుకుందని అబద్ధం చెబుతుంది ఆమె వదిన. ఆ విషయాన్ని రాము, విజిని అడుగుతాడు. తనపై నమ్మకంలేని రామును అసహ్యించుకుంటుంది విజి. తరువాత అన్న చెప్పిన తమ దూరం బంధువు ప్రతాప్ ను పెళ్ళాడుతుంది. అప్పుడు విజికి, ఆమె వదిన తాను ఎలా పగతీర్చుకున్నది చెబుతుంది. విజి బాధపడుతుంది. ప్రతాప్ ను భర్తగా అంగీకరించలేదు. కలకత్తాలో వారున్న ఇంటి పక్కనే రాము చేరతాడు. అతను ఓ దివ్యాంగురాలిని పెళ్ళాడి ఉంటాడు. తాను చేసిన ద్రోహానికి ప్రతిగా ఆ అమ్మాయిని పెళ్ళాడానని, తాను ఎంతో సంతోషంగా ఉన్నానని విజికి చెబుతాడు రాము. ప్రతాప్ తో విజిని ఆనందంగా ఉండమని కోరతాడు రాము. ప్రతాప్ ను తాను ఎంతగా బాధపెట్టానో అర్థం చేసుకున్న విజి, అతణ్ని చేరుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
గుర్తుకొస్తాయి మరి…
ఈ కథ విన్నప్పుడు తప్పకుండా మనకు మణిరత్నం ‘మౌనరాగం’ గుర్తుకు రాక మానదు. అందులోనూ నాయిక ఒకరిని ప్రేమించి, మరొకరిని పెళ్ళాడుతుంది. తాను ప్రేమించిన వాడు చనిపోయినా, అతణ్ణి మరచిపోలేక, భర్తతో సరిగా కాపురం చేయలేదు. చివరకు భర్త తనను ఎంతగా ప్రేమించాడో తెలుసుకొని, అతణ్ణి చేరుకోవడంతో కథ ముగుస్తుంది. పతాక సన్నివేశం కూడా ఒకేలా ఉంటుంది. కాకపోతే ‘మౌనగీతం’లో ఎయిర్ పోర్ట్ లో సీన్, ‘మౌనరాగం’లో రైల్ లో సీన్. అందువల్ల మణిరత్నంను ‘మౌనరాగం’ విడుదలయిన రోజుల్లో జనం బాగానే మోసేశారు. అయితే, ఈ రెండు చిత్రాలనూ విజయపథంలో పయనింప చేయడానికి ఇళయరాజా సంగీతం ఎంతగానో ఉపయోగపడిందని చెప్పవచ్చు. ‘మౌనగీతం’లోని “పరువమా… చిలిపి పరుగు తీయకు…” పాట యువతను ఆ రోజుల్లో భలేగా అలరించింది. ఈ పాటంతా సుహాసిని, మోహన్ ట్రాక్ షూట్స్ లో పరుగెత్తుతూనే ఉంటారు. అంతేకాదు, ఈ సినిమాను చూసిన ఎంతోమంది అమ్మాయిలు, అబ్బాయిలు అప్పట్లో ట్రాక్ షూట్స్ క్రేజీగా కొనుగోలు చేశారు. దర్శకుడు మహేంద్రన్ తరువాత ఛాయాగ్రాహకుడు అశోక్ కుమార్ కు ఈ సినిమా మంచి పేరు సంపాదించి పెట్టింది. తమిళనాట దాదాపు ఏడాది పాటు ప్రదర్శితమైన ‘నెంజతై కిల్లాదే’, తెలుగులో ‘మౌనగీతం’గానూ వందరోజులు పూర్తి చేసుకోవడం విశేషం.
