(సెప్టెంబర్ 14తో ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’కు 20 ఏళ్ళు)
తొలి చిత్రం ‘బద్రి’తోనే దర్శకునిగా తానేమిటో నిరూపించుకున్నారు పూరీ జగన్నాథ్. రెండో చిత్రం ‘బాచీ’ బాల్చీ తన్నేసింది. ‘బాచీ’ ద్వారా చక్రిని సంగీత దర్శకునిగా పరిచయం చేశారు పూరి. మధ్యలో ‘యువరాజా’ అనే కన్నడ సినిమా తీశాక, ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ తెరకెక్కించారు జగన్నాథ్. ఈ సినిమాతో రవితేజ హీరోగా నిలదొక్కుకున్నారు. చక్రి సంగీత దర్శకునిగా సెటిల్ అయిపోయారు. ఈ మూవీ తరువాత పూరీ జగన్నాథ్ కొన్ని వరుస విజయాలు చూశారు. 2001 సెప్టెంబర్ 14న ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ జనం ముందు నిలచి, వారి మనసులు గెలిచింది.
‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ – టైటిల్ లోనే వైవిధ్యం చూపించిన పూరీ జగన్నాథ్ కథలోనూ వరైటీ కోసమే తపించారు. వైజాగ్ సముద్ర తీరాన ఉండే మరణశిఖరం ఎక్కి చావాలనుకుంటాడు సుబ్రమణ్యం. అక్కడ శ్రావణి తారసపడుతుంది. ఇద్దరూ ఒకరికొకరు తాము ఎందుకు చావాలనుకున్నారో తెలుపుకుంటారు. తరువాత సుబ్రమణ్యం గదికి వెళ్ళి నిద్రమాత్రలు మింగి చావాలనుకుంటారు. ఇంటి ఓనర్ పుణ్యాన ఆసుపత్రిలో వారి ప్రాణాలు గట్టెక్కుతాయి. తరువాత శ్రావణి ఓ ఆఫీసులో ఉద్యోగంలో చేరుతుంది. ఆమె ఓనర్ కూతురు సుబ్రమణ్యంను చూసి అతనితో జీవితం పంచుకోవాలని ఆశపడుతుంది. సుబ్రమణ్యంకు పెళ్ళయినట్టు శ్రావణికి చెబుతుంది. ఆమె కూడా అది నమ్ముతుంది. కానీ, సుబ్రమణ్యంకు అసలు విషయం తెలిసి ఓనర్ కూతురును నిలదీస్తాడు. వారిద్దరి జీవితాలకు దూరంగా ఉండాలని శ్రావణి ఊరెళ్ళి తన మేనమామనే పెళ్ళి చేసుకుంటుంది. ఆ సమయానికే అక్కడకు వచ్చిన సుబ్రమణ్యం, శ్రావణి మేనమామలను చావతన్ని ఆమెను తీసుకుపోతాడు. ‘తాళి కట్టించుకోవడం కాదు, అది కట్టిన వ్యక్తి మనసు ముఖ్యం…’ అంటాడు సుబ్రమణ్యం. అయినా శ్రావణి కొండపై నుండి దూకుతుంది. ఆమెతో పాటు సుబ్రమణ్యం. ఇద్దరూ ఓ వలలో చిక్కుకుంటారు. మళ్ళీ ప్రాణాలు నిలుస్తాయి. ఇద్దరూ తమ కొత్త జీవితం గురించి మాట్లాడుకుంటూ వెళ్తూండగా కథ ముగుస్తుంది.
కథలో వైవిధ్యం చూపించడమే కాదు, సన్నివేశాల్లోనూ అలాగే సాగారు పూరి. అందువల్లే ఈ చిత్రం ద్వారా పూరీ జగన్నాథ్ కు ఉత్తమ కథకునిగా నంది అవార్డు లభించింది. ఇందులో రవితేజ, తనూరామ్, సమ్రిన్, అనంత్, అన్నపూర్ణ, తనికెళ్ళ భరణి, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరామ్, కల్పనారాయ్, ఉత్తేజ్, జీవా, ధర్మవరపు, జీవీ, రఘు కుంచె నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్వహించారు. వేణుగోపాల్ రెడ్డి, శేషు రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో చక్రి బాణీలకు తగ్గ పాటలను సాహితీ, చంద్రబోస్, కందికొండ, భాస్కరభట్ల రవికుమార్ పలికించారు. ఇందులోని “మళ్ళి కూయవే గువ్వా…”, “రామసక్కని బంగారిబొమ్మా…”, “ఏమేమవునో…”, “పిల్లో పిసినారి పిల్లో…” వంటి పాటలు జనాన్ని భలేగా అలరించాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించింది.