Site icon NTV Telugu

న్యూ ఇయర్‌ మందుతో 1000 కోట్ల ఆదాయం..

మందు బాబులపై తెలంగాణ ప్రభుత్వం భారీ అంచనాలే పెట్టుకుంది. కొత్త సంవత్సరం సమీస్తున్నందున ..రాబోవు రోజులలో కనీసం వెయ్యి కోట్ల రూపాయల ఆదాయాన్ని టార్గెట్‌ చేసింది. గత ఏడాది డిసెంబర్‌ నెల చివరి నాలుగు రోజుల్లో 759 కోట్ల రూపాయల మద్యం విక్రయించింది. నూతన సంవత్సరానికి గాను మద్యం స్టాక్‌ ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు జిల్లాలలోని అన్ని డిపోలకు చేరింది.

కొత్త మద్యం విధానంలో భాగంగా ఈ సంవత్సరం ప్రభుత్వం 404 వైన్‌ షాపులు, 159 బార్లకు అనుమతి ఇచ్చింది. ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మద్యం అమ్మకాల ద్వారా ఏటా ముప్పయ్‌ వేల కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే.

గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకుంటోంది. 2019 డిసెంబర్‌లో రాష్ట్రంలోని 2,236 వైన్‌ షాపుల నుంచి రెండు కోట్ల 46 లక్షల రూపాయలు గడించింది. విజయదశమి సందర్భంగా గత ఏడాది అక్టోబర్‌లో 2,623 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. గత డిసెంబర్‌ మాసంలో 2,765 కోట్ల మద్యం విక్రయించారు. ఈ ఏడాది జనవరిలో కూడా అదే స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఆ నెలలో 2,633 కోట్ల అమ్మకాలు రికార్డయ్యాయి. గత ఏడాది డిసెంబర్‌ 31న ఒక్క రోజే రెండు లక్షల ఇరవై వేల కేసుల ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌-IMFLతో పాటు, లక్ష కేసుల బీర్లు అమ్ముడయ్యాయి.

ప్రస్తుతం ఈ డిసెంబర్‌లో ఇప్పటికే 34 లక్షల IMFL కేసులు, 27 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. అమ్మకాల జోరు పెంచేందుకు కంపెనీలు సేల్స్ మెన్‌కు విదేశీ ప్రయాణాలతో పాటు మంచి మంచి బహుమానాలు ఆఫర్‌ చేస్తున్నాయి. కొత్త సంవత్సరం మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ఆబ్కారీ శాఖ వెయ్యి నుంచి 12 వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆశిస్తోంది. మరి దాని ఆశలు ఫలిస్తాయా లేదా అన్నది మందుబాబుల చేతుల్లోనే ఉంది!!

Exit mobile version