ఆస్కార్ అవార్డుల వేళ.. నిర్మాత దానయ్య మిస్సింగ్..?
ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలంటే.. కథ, కథనం, నటీనటులతో పాటు నిర్మాత ఎంతో ముఖ్యం. చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అనేది కేవలం ఆ బడ్జెట్ ను బట్టే ఉంటుంది. సినిమా సక్సెస్ విషయంలో డైరెక్టర్ ఎంత శ్రద్ద వహిస్తాడో నిర్మాత కూడా అంతే శ్రద్ద తీసుకుంటాడు. భారీ భారీ సెట్టింగ్స్, లొకేషన్స్, సినిమాకు అయ్యే ఖర్చుతో పాటు ప్రమోషన్స్ కూడా నిర్మాతనే భరించాలి. సినిమాలకు అవార్డులు వచ్చినా.. ప్రశంసలు వచ్చినా అందులో సగం నిర్మాతకకే దక్కుతాయి అన్నది నమ్మదగ్గ నిజం. అయితే ఒక పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కి ఎన్నో రికార్డులు సృష్టిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రికార్డులు తిరగరాసి.. హాలీవుడ్ లో సైతం తెలుగువాడి సత్తా చూపించిన సినిమా.. ఇక ఈ సినిమా ఆస్కార్ కు కూడా నామినేట్ అయ్యింది. అందరూ.. డైరెక్టర్ రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, హీరోలు చరణ్, తారక్ ను మాత్రమే ప్రశంసిస్తున్నారు. ఏ ఈవెంట్స్ లోనైనా వీరే కనిపిస్తున్నారు. మరి అంత బడ్జెట్ పెట్టిన దానయ్య ఎక్కడ..? సినిమా రిలీజ్ అప్పుడు జరిగిన ప్రమోషన్స్ లో కనిపించిన దానయ్య .. ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ కు సంబందించిన ఏ ఒక్క అవార్డు ఈవెంట్ లో కనిపించలేదు.
క్విడ్ ప్రోకో అంటే ఇదేనేమో..
కొన్ని సంబంధాలు వింటుంటే వింతగా అనిపిస్తుంటాయి. ఒక్కోసారి అవసరాలే ఇలాంటి విచిత్ర బంధాలను సృష్టిస్తాయేమో.. బీహార్లో మాత్రం అలాగే జరిగింది. ఓ వివాహిత కట్టుకున్న భర్తను వదిలి ప్రియుడితో జంప్ అయింది. దీనికి కక్ష పెంచుకున్న భర్త ఆమె ప్రియుడి భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన బీహార్‌లోని ఖగాడియా జిల్లాలో వెలుగు చూసింది. ఖగాడియా జిల్లా చౌథమ్ బ్లాక్‌లోని హార్డియా గ్రామంలో ముఖేశ్, నీరజ్ అనే ఇద్దరు నివసిస్తున్నారు. వీరికి వేర్వేరు మహిళలతో పెళ్లిళ్లు అయ్యాయి. కానీ నీరజ్ భార్య ముఖేశ్‌ను పెళ్లికి ముందే ప్రేమించింది. పెళ్లి అయిన తర్వాత కూడా ముఖేశ్‌తో సంబంధాన్ని కొనసాగించింది. అప్పటికే ముఖేశ్‌కు భార్య ముగ్గురు సంతానం. నీరజ్ కు నలుగురు సంతానం. అయినా ముఖేశ్, తన ప్రియురాలిని విడిచి ఉండలేకపోయాడు. ఆమె కూడా అతన్ని వదిలిపెట్టి ఉండలేకపోతోంది. దీంతో ముఖేశ్ తన ముగ్గురు పిల్లలను, ప్రియురాలిని తీసుకొని గతేడాది ఫిబ్రవరిలో ఇంటి నుంచి జంప్ అయ్యాడు. ఆ తర్వాత తన ప్రియురాలు రూబీని వివాహం చేసుకున్నాడు.
రైతులను నిలువునా దగా చేస్తున్న జగన్
ఏపీలోని జగన్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో రైతులను నిలువునా ముంచేశారని మండిపడ్డారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. ఎన్నికల ముందు రైతులకు 15 వేలు ఇస్తామన్నారు. ఎన్నికల తరువాత 7500 ఇస్తున్నాడు, కేంద్రం ఇస్తున్న 6 వేలు కలుపుకొని 13500 ఇస్తున్నామని డబ్బా కొడుతున్నాడు. రైతు భరోసా పేరుతో జగన్ చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు. రైతులకు వేల కోట్ల సాయం చేశామంటూ ఇచ్చిన ప్రకటనలన్నీ మోసం, మాయ. రైతుల ఆత్మ హత్యల్లో ఆంధ్ర ప్రదేశ్ ౩ వ స్థానంలో వుంది. ఇప్పటివరకు ౩ వేలమంది రైతులు ఆత్మ హత్యలకు పాల్పడ్డారని తెలిపారు కొల్లు రవీంద్ర. ఎన్నికల ముందు ధరల స్థిరీకరణ నిధి అన్నాడు, ఎంత మందికి ఇచ్చాడు. ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నాడు. ధాన్యం కొనుగోళ్ల లో లేనిపోని షరతులు పెట్టి రైతులను రోడ్డు న పడేసాడు. ఏ పంటకు మద్దతు ధర లభించలేదు, ధాన్యం సేకరణకు 37 లక్షల టన్నులకు కుదించారు. జగన్ మరిన్ని అప్పుల కోసం మోటార్లకు, మీటర్లు పెట్టి రైతు మెడకు వురి బిగిస్తున్నారు. ఆక్వా రంగాన్ని నాశనం చేసాడు. ఎన్నికల ముందు యూనిట్ 1.50 పైసలకు ఇస్తానన్నాడు. అధికారంలోకి వచ్చిన తరువాత 5.50 పైసలు చేసాడన్నారు.
మరో వివాదంలో ఎయిర్ ఇండియా.. ఈ సారి ఫుడ్లో పురుగులట
ఎయిర్ ఇండియా ఈ మధ్య తరచూ వివాదాల్లో చిక్కుకుంటుంది. ఇటీవల మూత్ర విసర్జన ఘటనలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా విమానంలో అందించే ఫుడ్ విషయమై మరోసారి వివాదాలను మూటగట్టుకుంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా విమానం బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మహవీర్ జైన్ అనే ప్రయాణికుడు ముంబై నుంచి చెన్నై వరకు ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్ లో ప్రయాణించాడు. ఈ సమయంలో అతడికి అందించిన ఆహారంలో పురుగు వచ్చింది. ఈ విషయాన్ని మహవీర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎయిర్ ఇండియా సంస్థపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. మహవీర్.. ఎయిర్ ఇండియా సంస్థ పరిశుభ్రత చర్యలు తీసుకున్నట్లు నాకు కనిపించడం లేదు. బిజినెస్ క్లాస్‌లో వడ్డించే భోజనంలో పురుగు వచ్చింది. అంటూ రాసుకొచ్చాడు. దీనిపై ఎయిర్ ఇండియా స్పందించింది. ఘనటకు గానూ ప్రయాణికుడిని క్షమాపణలు కోరింది. దీనిపై సరైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
గోవిందా.. గోవిందా. 7 రోజుల్లో 120 బిలియన్ డాలర్లు
ఇండియన్ ఈక్విటీ మార్కెట్ ఈమధ్య తీవ్రమైన నష్టాల్లో నడుస్తోంది. గడచిన వారం రోజుల్లో ఏకంగా 120 బిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. ఇవాళ మంగళవారం ఉదయం రెండు కీలక సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటికే లాభాల్లోకి వచ్చాయి. కానీ.. ఇంట్రాడేలో డౌన్ అయ్యాయి. చివరికి.. వరుసగా ఎనిమిదో రోజు నష్టాల్లో క్లోజయ్యాయి. ఆసియా ఖండంలోని ఇతర దేశాల మార్కెట్లు లాభాల్లో కొనసాగగా మన మార్కెట్లు నష్టాలను పొందటం గమనించాల్సిన విషయం. సెన్సెక్స్ 326 పాయింట్లు తగ్గి 58 వేల 962 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 88 పాయింట్లు కోల్పోయి 17 వేల 303 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 20 కంపెనీలు నష్టాల్లో నడిచాయి. రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ మీడియా ఇండెక్స్ 2 శాతానికి పైగా ర్యాలీ తీసింది. ఐటీ, మెటల్ షేర్లు నేల చూపులు చూశాయి. వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. త్రివేణి టర్బైన్ కంపెనీ షేర్ల విలువ 10 శాతం పెరిగింది.
పేదలకు మంచి జరగాలంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలి
పేదలకు మంచి జరగాలంటే.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాసీంపల్లి వద్ద విద్యార్థులతో రేవంత్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం అంటే విద్యార్థుల ఉద్యమం అని, విద్యార్థులు కేవలం చదువులకే పరిమితం కాకుండా సమాజం కోసం పోరాడారని అన్నారు. మలి తెలంగాణ ఉద్యమం విద్యార్థుల వల్లే ఉవ్వెత్తున ఎగసిందని, కేవలం రాజకీయ నాయకుల వల్లే తెలంగాణ ఏర్పడలేదని చెప్పారు. విద్యార్థుల త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందని ఉద్ఘాటించారు. ఆడపిల్లల హాస్టళ్లలో మౌళిక వసతులు లేవని, ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోవడం వల్ల సర్టిఫికెట్లు తీసుకునేటప్పుడు ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తమకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని ఆడబిడ్డలు ఆందోళన చెందుతున్నారన్నారు. విద్యార్థులతో మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో పాలనను కేసీఆర్ గాలికొదిలేశారని అర్థమైందని అన్నారు.
ప్రీతి పేరెంట్స్‌కి కవిత లేఖ.. అండగా ఉంటామని హామీ
ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడి, ఇటీవల ప్రాణాలు వదిలిన మెడికో ప్రీతి పేరెంట్స్‌ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. ప్రీతి మృతి పట్ల సంతాపం ప్రకటించిన ఆమె.. కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ‘‘గౌరవనీయులైన నరేందర్, శారద గారికి.. సోదరి డాక్టర్ ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఒక తల్లిగా నేను ఎంతో వేదనకు గురయ్యాను. ప్రీతి కోలుకోవాలని గత మూడు రోజులుగా కోరుకున్న కోట్లాది మందిలో నేనూ ఒకరిని. ఎన్నో కష్టాలకోర్చి పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రీతికి ఇలా జరగడం జీర్ణించుకోలేకపోతున్నాను. చదువుకుని సమాజానికి సేవ చేయాలన్న తపన, పట్టుదల మెండుగా ఉన్న ప్రీతికి ఇలా జరగడం దురదృష్టకరం. ఒక ఉత్తమ వైద్యురాలిని సమాజం కోల్పోయింది. అందుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. కడుపుకోత అనుభవిస్తున్న మీకు ఎంత ఓదార్పు ఇవ్వాలని ప్రయత్నం చేసినా.. అది చాలా తక్కువే అవుతుంది. ఏ తల్లిదండ్రులకు రాకూడని పరిస్థితి ఇది. మీ కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మీ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రీతి మరణానికి కారణమైన దోషులను రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టబోదు అని మీకు హామీ ఇస్తున్నాము’’ అంటూ ఆ లేఖలో రాసుకొచ్చారు.
వీధికుక్కల దాడి ఘటనపై మేయర్ సమీక్ష
మొన్న హైదరాబాద్, ఇప్పుడు విజయవాడ.. ప్రాంతం ఏదైనా వీధికుక్కల దాడి ఆందోళన కలిగిస్తోంది. విజయవాడలో వీధి కుక్కల దాడి ఘటనపై నగర మేయర్ సమీక్ష నిర్వహించారు. విఎంసి కార్యాలయంలో నగర కమీషనర్ తో సమీక్ష సమావేశం జరిగింది. నగర మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ బ్లూక్రాస్ సంస్ధ కోర్టులకు వెళ్తుంది. యానిమల్ యాక్ట్ కు లోబడి చర్యలు తీసుకోవాలి. విజయవాడ నగరంలోని వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నాం అన్నారు. వీధి కుక్కలకు భయపడి పిల్లలు బయటకు రాకుండా స్వేచ్ఛ కోల్పోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కలతో పాటు పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్ వేయించేలా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు మేయర్ భాగ్యలక్ష్మి. విజయవాడ భవానిపురం ఘటన చాలా బాధాకరం అన్నారు. ఇదిలా ఉంటే.. ఇవాళ వీధికుక్కలు విజయవాడలో రెచ్చిపోయాయి. భవానీపురంలో స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న ముగ్గురు చిన్నారులపై వీధికుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. స్థానికులు రాడ్డుతో కుక్కలను తరిమేయడంతో ప్రమాదం తప్పింది. కుక్కల దాడిలో నజీర్, చైతన్య కుమార్, జెస్సిక అనే ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు. ఇప్పటికే హైదరాబాద్ ఘటనతో వీఎంసీ అప్రమత్తంకాగా.. తాజాగా నగరంలో కుక్కలు పిల్లలపై దాడి చేయడం ఆందోళన పెంచుతోంది.