తెలుగువారి మదిలో చెరిగిపోని, తరిగిపోని స్థానం సంపాదించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు 99వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి తండ్రికి నివాళులు అర్పించారు నందమూరి బాలకృష్ణ. అంతేకాదు తండ్రికి ఘన నివాళిగా బాలయ్య స్వయంగా పాడిన ‘శ్రీరామదండకం’ వీడియోను తాజాగా విడుదల చేశారు. యన్టీఆర్ పోషించిన శ్రీరాముని పాత్రల బొమ్మలపై బాలయ్య గానం చేసిన’శ్రీరామదండకం’ గద్యం పాడారు. “సంపూర్ణ రామాయణం, లవకుశ, శ్రీకృష్ణసత్య, శ్రీరామాంజనేయ యుద్ధం, శ్రీరామపట్టాభిషేకం” చిత్రాలలోనూ “చరణదాసి, సి.ఐ.డి. చిట్టిచెల్లెలు, అడవిరాముడు” వంటి సాంఘికాలలోనూ శ్రీరాముని పాత్రలో కనిపించి అలరించారు యన్టీఆర్. తెలుగువారి మదిలోనే కాదు, యావత్ దక్షిణాదిన, కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లోనూ రాముడు అంటే రామారావే అన్న రీతిలో ఆకట్టుకున్నారాయన. శ్రీరామునిగా రామారావు నటించిన పౌరాణికాలు హిందీ, బెంగాలీ, ఒరియా భాషల్లోకి అనువాదమై అక్కడి వారినీ మురిపించాయి. శ్రీరామపాత్రలో అనితరసాధ్యంగా అభినయించిన రామారావు బొమ్మలు, వాటిపై బాలయ్య గానం చేసిన ‘శ్రీరామదండకం’ గద్యం నందమూరి అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. అయితే ఎంతో కష్టతరమైన సంస్కృత పదాలను ఈజీగా పలికేశారు బాలయ్య. సాహిత్యం పట్ల ఆయనకున్న అభిరుచికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక గత సంవత్సరం అత్యంత ప్రసిద్ధమైన ‘శివ శంకరి ..’ పాడి, తన అభిమానులకు విందుగా విడుదల చేసిన విషయం తెల్సిందే.
ఎన్టీఆర్ కు నివాళిగా బాలయ్య పాడిన శ్రీరామ దండకం
