తమిళ హీరో శివకార్తికేయన్ కు రాజమౌళి అండ్ కో షాక్ ఇచ్చింది. శివకార్తికేయన్ నటించిన ‘డాన్’ సినిమా పాండమిక్ సిట్యుయేషన్ వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పడు పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో మార్చి 25న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే అదే డేట్ న తమ ‘ఆర్ఆర్ఆర్’ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు రాజమౌళి అండ్ కో. నిజానికి జనవరి 7న విడుదల ప్రకటించిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ వరుసగా అన్ని భాషల్లో ఈవెంట్స్ చేస్తూ ప్రచారం చేసింది. అందులో భాగంగా తమిళ నాట కూడా ఓ ఈవెంట్ నిర్వహించింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథుల్లో ఒకరిగా హాజరయ్యాడు తమిళ హీరో శివకార్తికేయన్. ఇప్పుడు తమ సినిమా ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన శివకార్తికేయన్ సినిమాకి పోటీగా తమ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ని ప్రకటించారు. ముందుగా మార్చి 18న ‘ఆర్ఆర్ఆర్’ను రిలీజ్ చేయాలని భావించారు ‘ఆర్ఆర్ఆర్’ దర్శకనిర్మాతలు.
అయితే పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ను మార్చి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. పునీత్ కి నివాళిగా కన్నడ నాట ‘జేమ్స్’ విడుదల సందర్భంగా కర్ణాటకలోని థియేటర్లలో ఒక వారం పాటు మరే ఇతర చిత్రాలను ప్రదర్శించకూడదనే నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం మార్చి18న కర్ణాటకలో ‘ఆర్ఆర్ఆర్’ను విడుదల చేసే అవకాశాలు లేవు. దాంతో విడుదల తేదీని మార్చి 25కి మార్చారు. తమిళనాట శివ కార్తికేయన్ కూడా అదే డేట్ కి తన ‘డాన్’ విడుదల చేయాలని ప్లాన్ చేశాడు. తమిళ ‘డాన్’తో పాటు కార్తీక్ ఆర్యన్ నటించిన బాలీవుడ్ సినిమా ‘భూల్ భూలయ్యా 2’ను కూడా మార్చి 25న రిలీజ్ చేయటానికి ప్లాన్ చేశారు. ఇప్పుడు అదే డేట్ కి ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ప్రకటించటంతో ఆ సినిమాల విడుదలలు కూడా వెనక ముందు అయ్యే అస్కారం ఉంది. మరి శివకార్తికేయన్ వెనక్కి తగ్గుతాడో? లేక పోటీకి సై అంటాడో చూడాలి.