ఆ మధ్య ‘తాండవ్’ వెబ్ సిరీస్ తతంగం గుర్తుంది కదా! హిందువుల పరమదైవం అయిన శివుడ్ని అవమానించారు. అందులోనే దళితుల్ని కూడా తక్కువ చేసి చూపారని ఆరోపణలు వచ్చాయి. దాంతో పోలీస్ కేసులు, కోర్టు విచారణలు జరిగాయి. ‘తాండవ్’ కాంట్రవర్సీ కేసు ఇంకా ముగిసిపోలేదు. కానీ,ఇప్పుడు మరో ‘గ్రహణం’ పట్టుకుంది…
‘గ్రహణ్’ పేరుతో ఓ వెబ్ సిరీస్ వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇందిరా గాంధీ హత్య తరువాత దిల్లీలో సిక్కులపై జరిగిన ఊచకత నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ కథ నడుస్తుంది. ఇక వందలాది మంది సిక్కు సోదరుల హత్యలకి… రాజీవ్ గాంధీ అనుయాయులు , అప్పటి కాంగ్రెస్ నాయకులు కొందరు… కారణం అంటారు. ఆ విషయం ఎలా ఉన్నా, ‘గ్రహణ్’ వెబ్ సిరీస్ లో, ఇందిరా గాంధీ మరణం అనంతరం జరిగిన సిక్కుల ఊచకోతకి మరో సిక్కు వ్యక్తే కారణమని చూపారట!
Read Also: విజయ్ సీక్రెట్స్ బయట పెట్టిన మాళవిక మోహనన్!
1984 హింసకి అసలు కారకుల్ని వదిలేసి ఎవర్నో మధ్యలో తీసుకొచ్చి కారకుడుగా చూపటం ఇప్పుడు సిక్కు మతస్థులకి ఆగ్రహం తెప్పిస్తోంది. ప్రధానంగా ‘శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ’(ఎస్ జీపీసీ) వెబ్ సిరీస్ ని తీవ్రంగా ఖండిస్తూ బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తోంది. ‘ఎస్ జీపీసీ’ వాదనకి సొషల్ మీడియాలోనూ మద్దతు క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ‘గ్రహణ్’ వెబ్ సిరీస్ నిర్మాతపైన, డిస్నీ హాట్ స్టార్ ఇండియా హెడ్ పైన కేసులు నమోదు అయ్యాయి. అయితే, నెటిజన్స్ మాత్రం ‘గ్రహణ్’లో చూపిన విధానాన్ని పెద్ద ఎత్తున తప్పుబడుతున్నారు. చరిత్రని వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, సిక్కులు ఆన్ లైన్ లో ‘బ్యాన్ గ్రహణ్’ హ్యాష్ ట్యాగ్ ఉధృతంగా నడుపుతున్నారు. చూడాలి మరి, ‘తాండవ్’ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగానే స్పందించాయి. పోలీసులు కూడా కేసులు బలంగా పెట్టారు. ‘గ్రహణ్’కి కూడా అటువంటి పరిస్థితి తప్పదేమో…