Site icon NTV Telugu

‘స్టార్‌ మా’ డ్యాన్స్‌ ప్లస్ విజేతగా సంకేత్‌ సహదేవ్‌!

గత కొద్ది నెలలుగా స్టార్‌మాలో అత్యంత ఆసక్తిగా జరుగుతున్న స్టార్‌ మా డ్యాన్స్‌ ప్లస్ పోటీల ఫైనల్స్‌ ఆదివారం రసవత్తరంగా జరిగాయి. ఒకరిని మించిన ప్రదర్శన మరొకరు చేస్తూ వీక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. ప్రతి వారం వినూత్న నేపథ్యాలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫైనలిస్ట్‌లు ఫైనల్స్‌లో తమదైన సృజనాత్మకత, వైవిధ్యతను చూపడానికి ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వచ్చిన లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ప్రతి ఒక్కరికీ వినోదాన్ని పంచుతూ స్టార్‌ మా డ్యాన్స్‌ ప్లస్ ఫైనల్స్‌ లో వాసి టోనీ (యశ్వంత్‌ మాస్టర్‌ టీమ్‌), సంకేత్‌ సహదేవ్‌ (యశ్వంత్‌ మాస్టర్‌ టీమ్‌), మహేశ్వరి – తేజస్విని (బాబా మాస్టర్‌ బృందం), జియా ఠాకూర్‌ (అనీ మాస్టర్‌ బృందం), డార్జిలింగ్‌ డెవిల్స్‌ (రఘు మాస్టర్‌ బృందం) పోటీపడ్డారు. శాస్త్రీయ నృత్యానికి పాశ్చాత్య నృత్య రీతులను కూడా మిళితం చేసి మహేశ్వరి–తేజస్విని ఆకట్టుకుంటే, తమదైన వైవిధ్యతను చూపుతూ మిగిలిన పోటీదారులు ఆకట్టుకున్నారు. ఈ సీజన్‌ విజేతగా సంకేత్‌ సహదేవ్‌ నిలువడంతో పాటుగా 20 లక్షల రూపాయల బహుమతినీ గెలుచుకున్నారు.  గత 21 వారాలుగా స్టార్‌ మాలో ప్రసారమవుతున్న డ్యాన్స్‌ ప్లస్ షో హోస్ట్‌, దర్శకునిగా ఓంకార్‌ వ్యవహరించారు.

Exit mobile version