తెలుగు చిత్రసీమలో పలు చెరిగిపోని తరిగిపోని రికార్డులు నెలకొల్పిన ఘనత అన్న నందమూరి తారక రామారావుకే దక్కుతుంది. తెలుగునాట తొలిసారి నేరుగా ద్విశతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా పాతాళభైరవి
(1951) నిలచింది. తరువాత తొలి తెలుగు స్వర్ణోత్సవ చిత్రంగానూ పాతాళభైరవి
నిలచింది. ఆ పై మొట్టమొదటి వజ్రోత్సవ చిత్రం (60 వారాలు)గా లవకుశ
(1963) నిలచింది. ఆ పై నేరుగా మూడు వంద రోజులు ఆడిన సినిమాగా అడవిరాముడు
(1977) వెలిగింది. సాంఘికాలలోనూ వజ్రోత్సవ చిత్రంగా వేటగాడు
(1979) చరిత్ర కెక్కింది. అప్పట్లో తెలుగునాట అత్యధిక స్వర్ణోత్సవాల కథానాయకునిగా పాతాళభైరవి, లవకుశ, అడవిరాముడు, వేటగాడు, బొబ్బిలిపులి
రామారావు చరిత్ర సృష్టించారు. ఇక నేరుగా స్వర్ణోత్సవం చూసిన తొలి చిత్రంగా ఏయన్నార్ ప్రేమాభిషేకం
నిలచింది. అలాగే తెలుగునాట తొలి ప్లాటినమ్ జూబ్లీ (75 వారాలు) చిత్రంగానూ ప్రేమాభిషేకం
నిలచింది.
యన్టీఆర్ తరువాత తెలుగునాట అత్యధిక స్వర్ణోత్సవాలు కలిగిన ఏకైక నటునిగా ఆయన నటవారసుడు బాలకృష్ణ చరిత్ర సృష్టించారు. మంగమ్మగారి మనవడు, ముద్దుల క్రిష్ణయ్య, ముద్దుల మావయ్య, సమరసింహారెడ్డి, లెజెండ్
చిత్రాలు స్వర్ణోత్సవాలు చూశాయి. వీటిలో మంగమ్మగారి మనవడు, లెజెండ్
చిత్రాలు వరుసగా 565 రోజులు, 1005రోజులు ఆడి అరుదైన రికార్డు నెలకొల్పాయి. నేటికీ తెలంగాణలో అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా మంగమ్మగారి మనవడు
హైదరాబాద్ లో 565 రోజులతో రికార్డుగా నిలచింది. ఇక ఆంధ్ర, తెలంగాణ రెండు స్టేట్స్ లోనూ లెజెండ్
లాగా 1005 రోజులు ఆడిన సినిమా మరొకటి లేదు. ఆ మాట కొస్తే సౌత్ ఇండియాలోనే అత్యధిక రోజులు ఆడిన చిత్రంగా లెజెండ్
చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా గమనించదగ్గ అంశమేమంటే, యన్టీఆర్, బాలకృష్ణ రికార్డులు నెలకొల్పినవేవీ వారి సొంత చిత్రాలు కానీ, సొంత పంపిణీ సంస్థల్లో కానీ ఆడినవి కావు!
ఇక అప్పట్లో 5 ఆటలతో వంద రోజులు ఆడిన చిత్రంగా అడవిరాముడు
నెల్లూరు కనకమహల్ లో రికార్డు నెలకొల్పింది. ఆ తరువాత పదేండ్లకుకానీ, ఆ రికార్డును క్రాస్ చేయలేక పోయారు. అలా 5 ఆటలకు క్రేజ్ తీసుకు వచ్చిన ఘనత యన్టీఆర్ సొంతం. ఇక నాలుగు ఆటలతో వంద రోజులకు క్రేజ్ ను తీసుకు వచ్చిన చిత్రాలు యన్టీఆర్ నటించిన కొండవీటి సింహం, బొబ్బిలిపులి
. కాగా అసలు 28 కేంద్రాలలో 4 ఆటలతో వంద రోజులు ఆడి మొన్నటి దాకా జనంకోరుకుంటున్న నాలుగు ఆటల క్రేజ్ కు శ్రీకారం చుట్టిన ఘనత బాలకృష్ణ ముద్దుల మావయ్య
తోమొదలయింది. సిల్వర్ జూబ్లీస్ లో ప్రేమాభిషేకం
18 కేంద్రాలలో రెగ్యులర్ షోస్ (3 ఆటలే) తో రికార్డు ఉండగా, దానిని పెళ్ళిసందడి
23 కేంద్రాలలో 4 ఆటలతో రజతోత్సవం దాటింది. ఆ తరువాత ఏ స్టార్ హీరో సినిమా కూడా పెళ్ళిసందడి
ని క్రాస్ చేయలేక పోయింది. ఆ నేపథ్యంలో బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి
30 కేంద్రాలలో 4 ఆటలతో 175 రోజులు ప్రదర్శితమై, రజతోత్సవాలకు ఓ క్రేజ్ సంపాదించిపెట్టింది. ఆ తరువాతే స్టార్ హీరోస్ లో చిరంజీవి, మహేశ్ బాబు, జూనియర్ యన్టీఆర్ వంటి వారు సిల్వర్ జూబ్లీస్ లో రికార్డులు చూశారు. ఇప్పుడు ఈ ప్యాండమిక్ లో ఓ సినిమా డైరెక్ట్ గా 50 రోజులు ఆడడమే గగనమైన పరిస్థితుల్లో అఖండ
ఏకంగా 28 కేంద్రాలలో 4 ఆటలతో అర్ధ శతదినోత్సవం పూర్తి చేసుకొని రన్నింగ్
పరంగా మళ్ళీ అందరిలోనూ విశ్వాసం నెలకొల్పింది. ఈ ప్యాండమిక్ లోనూ కర్నూలు, వైజాగ్, గుంటూరు వంటి కేంద్రాలలో రెండు థియేటర్లలో అఖండ
యాభై రోజులు ఆడడం నిజంగా ఓ రికార్డ్! ఇలా కూడా మళ్ళీ రన్నింగ్ లో రికార్డులకు తెర తీసిన ఘనత బాలయ్యకే దక్కుతుందని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు.