YS Sharmila Satires On CM KCR National Party: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సీఎం కేసీఆర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తన యాత్రలో భాగంగా మెదక్‌లో పర్యటిస్తున్న ఆమె.. ఆయన కొత్త జాతీయ పార్టీపై సెటైర్లు వేశారు. అమ్మకు అన్నం పెట్టడు కానీ, పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తాడట అంటూ కౌంటర్ వేశారు. ఈ దరిద్రం మనకు చాలదన్నట్టు.. కేసీఆర్ ఇప్పుడు దేశాల మీద పడుతున్నాడంటూ విమర్శించారు. ఇక్కడ రైతులు, నిరుద్యోలుగు చనిపోతుంటే.. కేసీఆర్ వారిని ఆదుకోవడం లేదని ఆరోపించారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న ఆమె.. గూట్లో రాయి తియ్యనోడు ఏట్లో రాయి తీస్తాడట అంటూ ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణ చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని.. మరి, బంగారు తెలంగాణ అయ్యిందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి.. ఆయన కొడుకులకు, అల్లుళ్లకు మాత్రమే బంగారు తెలంగాణ అయ్యిందని పేర్కొన్నారు. ఎనిమిదేళ్లలో ఉద్యోగాలు లేక రాష్ట్రంలోని యువత ఆత్మహత్య చేసుకుంటోందని.. అలాగే భరోసా లేకు రైతులు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని షర్మిల చెప్పారు. తెలంగాణలో ఏ వర్గాన్నైనా సీఎం కేసీఆర్ ఆదుకున్నారా? అని ఆమె నిలదీశారు.
అంతకుముందు తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై కూడా షర్మిల కౌంటర్లు గుప్పించారు. జనంతో నేనున్నా, జనంలో నేనున్నా.. సమస్యల పరిష్కారంలో మీరెక్కడ కేటీఆర్? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను ఆదుకోవడంతో నువ్వెక్కడ? నీ జాడెక్కడ? అని నిలదీశారు. కొలువుల కోసం ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారని, పంటలు నష్టపోయి రైతులు కూడా సూసైడ్‌కి పాల్పడ్డారని.. మరి వారి కుటుంబాలను ఆదుకున్నారా? అని షర్మిల అడిగారు. ఆదివాసీల మీద దాడులు జరిగినప్పుడు, వరదల కారణంగా రోడ్డున పడ్డ కుటుంబాలని సైతం ఆదుకోలేదని కేటీఆర్‌పై మండిపడ్డారు. అధికారంలో ఉండి కూడా సమస్యల్ని పరిష్కరించడం లేదని.. జనాన్ని చచ్చేలా చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారం లేకపోయినప్పటికీ తాను ప్రజలకు అండగా ఉన్నానని, వారిని ఆదుకోవంలో తనవంతు కృషి చేస్తున్నానని చెప్పారు. కరోనాతో కుటుంబ పెద్దనను కోల్పోయిన కుటుంబాల్ని ఆదుకోవడంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందంటూ షర్మిల చెప్పారు. సెప్టెంబర్ 30న సాగర హారానికి పదేళ్లు నిండిన సందర్భంగా కేటీఆర్ కేటీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ చేసిన ఓ ట్వీట్‌కి.. షర్మిల పై విధంగా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు.