Site icon NTV Telugu

మానవత్వం చాటుకున్న వైఎస్ షర్మిల

తెలంగాణ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె పాదయాత్ర నల్గొండ జిల్లా చింతపల్లి సమీపంలో కొనసాగుతోంది. అయితే గురువారం చింతపల్లి మండలం క్రిష్టారాయపల్లిలో వైఎస్ షర్మిల బస చేస్తున్న క్యాంప్ సమీపంలో ఓ రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం వైఎస్ షర్మిలకు తెలియడంతో ఆమె వెంటనే స్పందించి 108 వాహనానికి ఫోన్ చేశారు.

Read Also: రాముడికి ముస్లిం మహిళల హారతి

అయితే 108 వాహనం సమయానికి ఘటనా స్థలానికి చేరుకోలేదు. దీంతో గాయపడ్డ వ్యక్తులను వైఎస్ షర్మిల తన కాన్వాయ్‌లో ఎక్కించుకుని ఆస్పత్రికి తరలించడంలో సాయపడ్డారు. అటు 108 వాహనం సమయానికి రాకపోవడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 108 సేవలు ఎలా ఉన్నాయో ఈ ఘటనను బట్టి చూస్తే అర్ధమవుతోందని ఆమె ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడే 108 వాహనాల విషయంలో కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. కాగా వైఎస్ షర్మిల చూపిన మానవత్వంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Exit mobile version