YS Sharmila Challenges CM KCR And KTR: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు సవాల్ విసిరారు. తనతో పాటు పాదయాత్రకు రమ్మని.. ఒకవేళ సమస్యలు లేకపోతే తాను ముక్కు నేలకి రాసి ఇంటికెళ్లిపోతానని, సమస్యలుంటే మాత్రం మీ ముక్కు నేలకి రాసి రాజీనామా చేయాలని అన్నారు. కుల్చాడం మండలంలోని చిన్న ఘనపూర్ గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆమె ఆ సవాల్ చేశారు. తమ పాలన అద్భుతంగా ఉందని కేసీఆర్, కేటీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని.. కానీ తెలంగాణలో చాలా సమస్యలున్నాయని తాను చూపిస్తానని పేర్కొన్నారు. వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ అయినా, ఇప్పుడు కేసీఆర్ అయినా.. స్వార్థ ప్రయోజనాల కోసమే పరిపాలన చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో షర్మిల మరో ఛాలెంజ్ చేశారు. మీ పాలన మీద మీకు నమ్మకంటే.. ఒక దళితుడ్ని ముఖ్యమంత్రిని చేయాలని, మీకు దమ్ముంటే ఈ సవాల్‌ని స్వీకరించండని నిలదీశారు.
ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు సీఎం కేసీఆర్ అవార్డులు తీసుకుంటున్నారని.. నిజానికి ఈ అవార్డులు ఇవ్వాల్సింది ప్రజలని షర్మిల పేర్కొన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. బంగారు తెలంగాణ చేస్తామని ఇచ్చిన మాట తప్పారన్నారు. రుణమాఫీ చేవారా? ఫీజు రియిండర్స్‌మెంట్ ఇస్తున్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా.. విద్యార్థుల సర్టిఫికెట్‌లు ఆపేశారని మండిపడ్డారు. ఉద్యోగాలు ఇస్తానని హామీని సైతం నెరవేర్చలేదని ఆగ్రహించారు. ఎనిమిదేళ్ల నుంచి ఉద్యోగాలు లేక.. ఎంతోమంది బిడ్డలు ప్రాణాలు తీసుకున్నారన్నారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారని చెప్పారు. పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేర్లు చెప్పి.. లక్షల కోట్ల తెలంగాణ ఖజానా దోచేశారని ఆరోపణలు గుప్పించారు. ‘అందుకేనా మీకు ఈ అవార్డులు?’ అంటూ తూర్పారపట్టారు. వైఎస్సార్ పథకాలు మొత్తం అమలు కాకుండా పోయాయని షర్మిల ఫైర్ అయ్యారు. కాగా.. వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 2400 కిలోమీటర్ల మైలురాయిని దాటేసింది.
