NTV Telugu Site icon

YS Sharmila: పంజాగుట్టలో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో షర్మిల

Sharmila Arrest

Sharmila Arrest

YS Sharmila Arrest In Punjagutta: కొంతకాలం నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేస్తోన్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. తాజాగా ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే.. ఈ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. తొలుత లోటస్‌పాండ్‌లోని షర్మిల నివాసం వద్ద హైడ్రామా నడిచింది. షర్మిల బయటకు రాకుండా.. ఇంటి బయట భారీగా పోలీసులు మోహరించి, ఆమెను హౌస్ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే.. ఆమె పోలీసుల కళ్లుగప్పి, వారికి తెలియకుండా అక్కడి నుంచి బయలుదేరారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు.. ఆమె ప్రగతి భవన్ చేరకుండా, సోమాజిగూడలో అడ్డుకున్నారు.

నిన్న టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన కారులోనే ఆమె వెళ్లారు. దీంతో.. పోలీసులు షర్మిల కారుకు అడ్డంగా తమ వాహనాలను నిలిపారు. షర్మిలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. ఆమె తన కారు అద్దాలు మూసివేసి, కారులోనే బైఠాయించారు. ఈ క్రమంలో షర్మిల, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనకు ముందుకు వెళ్లడానికి అనుమతి ఇవ్వకపోవడంతో.. పోలీసుల తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి కదలకుండా, కారులోనే కూర్చుండిపోయారు. దీంతో.. పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎంత చెప్పినా షర్మిల కారు నుంచి బయటకు రావడానికి నిరాకరించడం, ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయిపోవడంతో.. పోలీసులు టోయింగ్ వెహికిల్ రప్పించి, షర్మిల ఉండగానే కారుని తరలించారు. తమ అధ్యక్షురాలిని ఇలా అడ్డగించడం, అదుపులోకి తీసుకోవడంతో.. ప్రగతి భవన్ వద్ద వైఎస్సార్టీపీ శ్రేణులు నిరసకు దిగారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

కాగా.. సోమవారం షర్మిల పాదయాత్రపై టీఆర్ఎస్​ కార్యకర్తలు దాడికి దిగిన విషయం తెలిసిందే! ఈ దాడిలో ఆమె ప్రయాణించే బస్సు దగ్ధమైంది. కాన్వాయ్‍లోని వాహనాలపై కూడా రాళ్ల దాడి చేయడంతో.. షర్మిల కారు అద్దాలు పగిలాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి కూడా నిప్పుపెట్టడంతో పాటు.. పాదయాత్ర కోసం ఊరురా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, జెండాలను సైతం తగలబెట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి.. పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఆమెని అరెస్ట్ చేసి, పోలీస్ వాహనంలో హైదరాబాద్ తరలించారు.