Site icon NTV Telugu

YISU : యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ.. తెలంగాణ యువతకు ‘ఉద్యోగ’ కల్పవృక్షం

Yisu

Yisu

YISU : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగితను నిర్మూలించి, యువతను గ్లోబల్ మార్కెట్‌కు సిద్ధం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ (YISU) ఒక కీలక మైలురాయిని అధిగమించింది. కేవలం డిగ్రీలు మాత్రమే కాకుండా, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాన్ని (Skills) అందిస్తూ, ఈ యూనివర్సిటీ అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. యూనివర్సిటీ ప్రారంభమైన అనతి కాలంలోనే విశేషమైన ఫలితాలను కనబరిచింది. 2025 డిసెంబర్ నాటికి సుమారు 1000 మందికి పైగా విద్యార్థులకు వివిధ రంగాల్లో శిక్షణ అందించింది. నైపుణ్య విద్యా రంగంలో ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయి లక్ష్యాన్ని చేరుకోవడం దేశంలోనే ఒక ప్రత్యేకతగా నిలిచింది.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆకాంక్ష మేరకు 2024 ఆగస్టు 1న ఈ యూనివర్సిటీకి శంకుస్థాపన జరిగింది. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో నడుస్తున్న ఈ సంస్థకు ముఖ్యమంత్రే ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్నారు. పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహింద్రా బోర్డు ఛైర్మన్‌గా, డా. వి.ఎల్.వి.ఎస్.ఎస్. సుబ్బారావు వైస్ ఛాన్స్ లర్‌గా వ్యవహరిస్తూ యూనివర్సిటీని విజయపథంలో నడిపిస్తున్నారు. ప్రస్తుతం IIIT హైదరాబాద్‌లో తాత్కాలికంగా కొనసాగుతున్న ఈ యూనివర్సిటీకి, కందుకూరు మండలం–ఫ్యూచర్ సిటీలో శాశ్వత క్యాంపస్ రూపుదిద్దుకుంటోంది. 57.8 ఎకరాల్లో.. 43 హైటెక్ క్లాస్ రూమ్‌లు, 600 పడకల హాస్టల్, 84 వేల చదరపు అడుగుల వైశాల్యంలో అత్యాధునిక ల్యాబ్‌లు. 2026 మార్చి నాటికి ఫేజ్-1 నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది.

India-Pak: కాల్పుల విరమణలో ఎవరి జోక్యం లేదు.. చైనా వాదనను తోసిపుచ్చిన భారత్

యూనివర్సిటీ కేవలం థియరీకి పరిమితం కాకుండా, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న రంగాలపై దృష్టి సారించింది. లాజిస్టిక్స్, హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్, ఫార్మా, బ్యాంకింగ్ (BFSI), ఇన్ఫర్మేషన్ సైన్స్ లక్ష్యం. మైక్రోసాఫ్ట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, AIG, అపోలో హాస్పిటల్స్, GMR కార్గో వంటి దిగ్గజ సంస్థలు విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, ప్రాక్టికల్ ట్రైనింగ్ అందిస్తున్నాయి.

ఈ యూనివర్సిటీ ప్రధాన ఉద్దేశం సర్టిఫికేట్లు పంచడం కాదు, ఉద్యోగాలను సాధించి పెట్టడం. అందుకే షార్ట్ టర్మ్ , సర్టిఫికేషన్ కోర్సుల ద్వారా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుండి పూర్తి స్థాయి డిగ్రీ, పీజీ కోర్సులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. “డిగ్రీ చేతిలో ఉన్నా ఉద్యోగం రాలేదు” అనే నిరాశలో ఉన్న యువతకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఒక భరోసాగా మారింది. పరిశ్రమల భాగస్వామ్యంతో, ప్రభుత్వ పర్యవేక్షణలో నడుస్తున్న ఈ సంస్థ భవిష్యత్తులో తెలంగాణను ‘నైపుణ్యాల రాజధాని’గా మార్చడం ఖాయంగా కనిపిస్తోంది.

Tirumala Laddu Sales: రికార్డు సృష్టించిన శ్రీవారి లడ్డూ విక్రయాలు..

Exit mobile version