Site icon NTV Telugu

Yadadri Scam: యాదాద్రిలో డాలర్స్ మాయం.. ఆడిట్‌లో బయటపడ్డ అసలు నిజం.!

Yadadri

Yadadri

యాదగిరిగుట్ట దేవాలయ ప్రచార శాఖ ఆధ్వర్యంలో భక్తుల కోసం విక్రయించే బంగారు , వెండి డాలర్ల లెక్కల్లో భారీ వ్యత్యాసం ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏడాది కాలంగా ఈ డాలర్లు మాయమైనట్లు తాజాగా నిర్వహించిన అంతర్గత ఆడిట్‌లో అధికారులు గుర్తించారు. ఆలయ రికార్డుల ప్రకారం ఉండాల్సిన స్టాక్‌కు, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న డాలర్లకు అస్సలు పొంతన లేకపోవడంతో ఈ మోసం బయటపడింది. అదృశ్యమైన ఈ డాలర్ల మొత్తం విలువ సుమారు 10 లక్షల రూపాయలకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో విలువైన వస్తువులు మాయమవ్వడం ఆలయ భద్రత , పర్యవేక్షణపై పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.

Varanasi : వారణాసి లో భారీ హోర్డింగ్స్.. రాజమౌళి పనేనంటూ కామెంట్స్..

ఇటీవలే యాదాద్రి లడ్డు ప్రసాదంలో నాణ్యత లోపించడం, చింతపండు వినియోగంపై తలెత్తిన వివాదం మరువకముందే ఈ డాలర్ల మాయం వ్యవహారం వెలుగు చూడటం ఆలయ అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి అవకతవకలు జరగడం పట్ల భక్తులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ఆస్తులను, భక్తుల నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రచార శాఖలోని కొందరు సిబ్బంది సహకారంతోనే ఈ డాలర్లు పక్కదారి పట్టి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

దేవాలయానికి కొత్త కార్యనిర్వహణాధికారి (EO) బాధ్యతలు స్వీకరించడంలో జాప్యం జరగడం వల్ల ఈ ఆడిట్ రిపోర్ట్ సమర్పించడం కొంత ఆలస్యమైంది. ప్రస్తుతం ఆడిట్ ప్రక్రియ పూర్తవ్వడంతో, త్వరలోనే పూర్తిస్థాయి నివేదికను ఈఓకు అందజేయనున్నారు. బాధ్యులైన సిబ్బందిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, పోయిన డాలర్ల రికవరీ కోసం అధికారులు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కూడా దృష్టి సారించి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Keerthy Suresh :15 ఏళ్లలో అతడు ఏడవడం మొదటి సారి చూశా..

Exit mobile version