Site icon NTV Telugu

Minister KTR: ఆ చరిత్ర ఏ పార్టీకీ లేదు.. ఇచ్చిన హామీల్ని అమలు చేస్తాం

Ktr Munugode Pressmeet

Ktr Munugode Pressmeet

We Will Fulfill All Promises To Nallagonda District Says Minister KTR: నల్లగొండలో 12 స్థానాలను గెలిచిన చరిత్ర ఏ పార్టీకి లేదని, మీరు ఇంతలా ఆశీర్వదించినందుకు ఇక్కడికి వచ్చామని మంత్రి కేటీఆర్ మునుగోడులో నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి సంక్షేమ సమీక్ష సమావేశంలో వ్యాఖ్యానించారు. మునుగోడును‌ గెలిపిస్తే నియోజకవర్గాన్ని గుండెల్లో పెట్టుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. మీరు గెలిపించింది కేవలం ఒక్క కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని కాదని, మా అందరినీ అని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలన్నింటినీ తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఉమ్మడి జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ లేదని.. కేసీఆర్ వచ్చాక నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంతో పాటు క్లాసులు కూడా ప్రారంభించామని తెలిపారు.

దామరచర్లలో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కారణంగా.. రాబోయే వందేళ్ల వరకు విద్యుత్ అవసరాలు తీర్చే ప్రాజెక్టు నిర్మిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. అక్కడే సోలార్ పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తామని మాటిచ్చారు. తెలంగాణలో అత్యధికంగా వరి పండించేది నల్లగొండ జిల్లాలోనే అని, ఇక్కడి సాగు విస్తీర్ణం కేవలం కేసీఆర్ ప్రోత్సాహంతోనే పెరిగిందని పేర్కొన్నారు. తిరుమల స్థాయిలో యాదాద్రికి భక్తులు తరలివస్తున్నారన్నారు. దండు మల్కాపురంలో 540 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ స్థాపించి, పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలు టీఆర్ఎస్‌ను ఏవిధంగా గుండెల్లో పెట్టుకుని 12 నియోజకవర్గాల్లో గెలిపించారో.. మిమ్మల్ని అలానే గుండెల్లో పెట్టుకుంటామన్నారు. రాబోయే ఏడాది కాలంలో ఉమ్మడి జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో.. ఇవాళే సమీక్ష చేసేశామన్నారు. రూ. 402 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వసతుల కల్పన కోసం రూ.700 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. మున్సిపాలిటీల్లో రూ.334 కోట్లు, గిరిజనుల అభివృద్ధి కోసం రూ.100 కోట్ల కేటాయిస్తున్నామన్నారు.

మొత్తం ఆరేడు నెలల్లో.. రూ.1544 కోట్లు కేటాయించి ఖర్చు చేయబోతున్నామని కేటీఆర్ అన్నారు. మునుగోడులో రూ.100 కోట్లతో రహదారుల విస్తరణ చేస్తామన్న ఆయన.. పంచాయితీ రాజ్ శాఖ ద్వారా రూ. 174 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. చండూరు మున్సిపాలిటీకి రూ. 30 కోట్లు, చౌటుప్పల్ మున్సిపాలిటీకి రూ. 50 కోట్లు, గిరిజనుల కోసం అభివృద్ధి నిధులు, ఐదు సబ్ స్టేషన్ల నిర్మాణం కోసం రూ. 8 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలో వంద పడకల ఆస్పత్రి నిర్మిస్తామని పేర్కొన్నారు. దండు మల్కాపురంలో వంద ఎకరాల్లో టాయ్ పార్క్ ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. చండూరుని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తామని, నారాయణపురంలో గిరిజన గురుకుల పాఠశాలతో పాటు సేవాలాల్ బంజారా భవన్‌ని ఏర్పాటు చేస్తామన్నారు. నాలుగు హ్యాండ్లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు. ఎన్నికల ప్రచార సమయంలో మునుగోడు అభివృద్ధి కోసం ఏమైతే హామీలిచ్చామో.. అవన్నీ చేసుకుంటూ ముందుకు పోతామని మంత్రి కేటీఆర్ వివరించారు.

Exit mobile version