Two transgender doctors get government jobs in Telangana: తెలంగాణలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు చరిత్ర సృష్టించారు. డాక్టర్లు అయిన ప్రాచీ రాథోడ్, రూత్ జాన్‌పాల్ కొయ్యాల అనే ట్రాన్స్‌జెండర్స్.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. దీంతో.. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన తొలి ట్రాన్స్‌జెండర్స్‌గా వాళ్లు చరిత్రపుటలకెక్కారు. వాళ్లిద్దరు ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్స్‌గా నియమితులయ్యారు. ఇది ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చారిత్రాత్మక విజయాన్ని సూచిస్తుంది. అయితే.. వీళ్లు ఈ స్థాయికి చేరుకోవడానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది.
‘‘నేను 2018లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. అప్పటినుంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగా.. హైదరాబాద్‌లోని 15 ఆసుపత్రులు నన్ను తిరస్కరించాయి. నా ఐడెంటిటీ వల్లే తిరస్కరిస్తున్నట్టు వాళ్లు నాకు చెప్పలేదు కానీ, నేను ఆ విషయాన్ని స్పష్టంగా గమనించగలను. నా ఐడెంటిటీ బయటపడ్డాక, ఆసుపత్రులకు నా విద్యార్హత పట్టించుకోలేదు’’ అంటూ రూత్ జాన్‌పాల్ చెప్పుకొచ్చింది. అయితే.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో తాను చాలా సంతోషంగా ఉన్నానని, ఇది తన కమ్యూనిటీకి కూడా గొప్ప రోజు అని తెలిపింది. అసలు తాను ఇది సాధిస్తానని ఏనాడూ అనుకోలేదని చెప్పింది.
అటు.. ప్రాచీ రాథోడ్ కూడా ఎన్నో పరాభావాల్ని ఎదుర్కొంది. తాను ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ఒక ప్రైవేట్ సెక్టార్‌లో పని చేశానని, అయితే తన ఐడెంటిటీ తెలిశాక తనని ఉద్యోగంలో నుంచి తీసేశారని ప్రాచీ తెలిపింది. తాను ట్రాన్స్‌జెండర్ అనే విషయం తెలిస్తే, ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల సంఖ్య తగ్గిపోతుందని ఆ ఆసుపత్రి యాజమాన్యం తనతో చెప్పిందని ఆమె వాపోయింది. ఇలా తామిద్దరం ఎన్నో తిరస్కరణల తర్వాత.. 2021లో నారాయణగూడలోని యూఎస్ఏఐడీ ట్రాన్స్‌జెండర్ క్లినిక్ ‘మిత్ర్’లో చేరామని తెలిపారు.
గత రెండేళ్లలో తాము ఎన్నో సమస్యల్ని ఎదుర్కున్నామని.. వ్యక్తిగత సమస్యలతో పాటు సామాజిక వివక్షతో పోరాడాల్సి వచ్చిందని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు పొందినందుకు తాము చాలా గర్వపడుతున్నామని అన్నారు. అయితే.. అక్కడ కూడా వీళ్లకు తప్పకుండా సవాళ్లు ఎదురవుతాయని ట్రాన్స్‌జెండర్స్ రైట్స్ యాక్టివిస్ట్ రచన ముద్రబోయిన తెలిపారు. ఈ నేపథ్యంలో.. తమ ప్రయాణం ఎలా సాగుతుందో తెలీదు కానీ, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగానే ఉన్నామని వాళ్లిద్దరు పేర్కొన్నారు.
రోగులు కూడా తమ పట్ల వివక్ష చూపించొచ్చని, కానీ ఎప్పుడైతే వైద్యం అందిస్తామో, అప్పుడు తప్పకుండా వారిలో మార్పు వస్తుందని, తామే కావాలని పేషెంట్స్ సిఫార్సు చేసేలా ఈ రంగంలో సత్తా చాటుతామని రూత్, ప్రాచీ తెలిపారు. తాము నీట్ ఎగ్జామ్స్ రాసినా, రిజర్వ్ సీట్స్ దొరకలేదని అన్నారు. 2014లో తమని థర్డ్ జెండర్‌గా గుర్తించి.. ఉద్యోగాల ప్రవేశాల్లో రిజర్వేషన్ మంజూరు చేయాలని సుప్రీం ఇచ్చిన తీర్పుకి ఇది విరుద్ధమన్నారు. ఇక రాష్ట్ర కౌన్సెలింగ్ జాబితా తమని మహిళాగా వర్గీకరించింది.. దీనిపై తాము ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ సమర్పించామని, అవసరమైన చట్టపరమైన మార్గాన్ని కూడా ఎంచుకుంటమని ప్రాచీ చెప్పుకొచ్చింది.