Good News : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికంగా ఊరటనిస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో భాగంగా డిసెంబర్ మాసానికి సంబంధించి రూ. 713 కోట్లను విడుదల చేస్తూ ఆయన బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు తక్షణమే నిధులను మంజూరు చేశారు. గతంలో ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ ప్రకారం, ప్రతినెల రూ. 700 కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మాటకు కట్టుబడి, జూన్ నెలాఖరులో రూ. 183 కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం, ఆపై ఆగస్టు మాసం నుంచి ప్రతి నెలా క్రమం తప్పకుండా కనీసం రూ. 700 కోట్లకు తగ్గకుండా నిధులను మంజూరు చేస్తూ వస్తోంది.
India-Pak: కాల్పుల విరమణలో ఎవరి జోక్యం లేదు.. చైనా వాదనను తోసిపుచ్చిన భారత్
తాజాగా విడుదల చేసిన ఈ రూ. 713 కోట్ల నిధులతో ఉద్యోగుల గ్రాట్యూటీ, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF), సరెండర్ లీవులు మరియు వివిధ రకాల అడ్వాన్స్‌లకు సంబంధించిన పెండింగ్ క్లెయిమ్‌లు పరిష్కారం కానున్నాయి. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈ ‘ప్రజా ప్రభుత్వం’ అత్యంత ప్రాధాన్యతతో ఈ నిధులను కేటాయిస్తోంది. వరుసగా నిధులు విడుదలవుతుండటంతో ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే, ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.
