TS CPGET 2022 Results Out: కామన్ పీజీ ఎంట్రన్స్ ఫలితాలను విద్యామండలి ఛైర్మన్ ఆర్ లింబాద్రి, ఓయూ వీసీ డి. రవీందర్ విడుదల చేశారు. రాష్ట్రంలోని 8 వర్సిటీల పరిధిలో పీజీ, ఇంటిగ్రేటెడ్, పీజీ డిప్లమా కలిపి మొత్తం 50 కోర్సుల్లో ప్రవేశాల కోసం.. ఆగస్టు 11వ తేదీ నుంచి 23 వరకు ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ పీజీగెట్‌కు మొత్తం 67,117 మంది దరఖాస్తు చేసుకోగా.. 57,262 మంది హాజరయ్యారు. అంటే.. దాదాపు పది వేల మంది గైర్హాజరయ్యారు. వారిలో 54,050 మంది క్వాలిఫై అయ్యారు. 94.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పురుషుల కన్నా మహిళల అర్హతే ఎక్కువ ఉంది. 67 శాతం మహిళలు (36,437), 33 శాతం పురుషులు (17,613) అర్హత సాధించారు. ప్రభుత్వ చర్యల వల్లే ఉన్నత విద్యాలోకి మహిళలు అధిక సంఖ్యలో వస్తున్నారు.
అయితే.. గతేడాదితో పోలిస్తే మాత్రం ఈ ఏడాది దరఖాస్తులు పది వేలు తగ్గినట్టు రిపోర్ట్స్‌లో తేలింది. యూనివర్సిటీ క్యాంపస్‌లతో పాటు మొత్తం 320 కాలేజీల్లో 45 వేల 3 సీట్లు ఉండగా.. మహిళా వర్శిటీలో 514 సీట్లు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన 800 మంది సైతం ఈ కామన్ పీజీ ఎంట్రన్స్ రాశారు. త్వరలోనే కౌన్సిలింగ్ షెడ్యూల్‌ని విడుదల చేయనున్నారు. ప్రవేశ పరీక్షలో ర్యాంకు ఆధారంగా.. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం.. ఇలా రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పించడం జరుగుతుంది. తెలంగాణ CPGET ఫలితాల కోసం cpget.tsche.ac.in లో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
