Site icon NTV Telugu

Himanta Biswa Sarma: మైక్ లాగి, అసోం సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ నేత

Trs Leader Assam Cm Speech

Trs Leader Assam Cm Speech

TRS Leader Try To Stop Assam CM Himantha Biswa Sarma Speech In Hyderabad: హైదరాబాద్ ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గణేశ్ ఉత్సవ కమిటీలో అసోం సీఎం హమంత బిశ్వ శర్మ ప్రసంగాన్ని టీఆర్ఎస్ కార్యకర్త నందుబిలాల్ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్న సమయంలో, వెనుక నుంచి నందుబిలాల్ చొచ్చుకొని వచ్చి మైక్ లాగేశాడు. అనంతరం అసోం సీఎంతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా అప్రమత్తమైన గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు.. నందుబిలాల్‌ను కిందకు దించారు. అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత శర్మ తన ప్రసంగాన్ని కొనసాగించి, అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈ ఘటనపై మంత్రి తలసాని మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను ప్రశాంతంగా ఉండనివ్వరా? అంటూ బీజేపీపై మండిపడ్డారు. హైదరాబాద్ ప్రజల్ని రెచ్చగొట్టడానికి అసోం సీఎంను తెలంగాణకు తెచ్చారని అన్నారు. తాము కూడా అసోం వెళ్లి మాట్లాడగలమని హెచ్చరించారు. సీఎం లాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి.. హైదరాబాద్‌కు ఏ ఉద్దేశంతో వచ్చారో, దానిపై దృష్టి సారిస్తే బాగుంటుందని సూచించారు. ఆయన వాడిన అసభ్యకరమైన పదజాలాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అసోం సీఎం వల్గర్‌గా మాట్లాడినందుకే, టీఆర్ఎస్ నేత మైక్ లాగేయడం జరిగిందని తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ని చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తుండడం బాధాకరమైన విషయమన్నారు. అక్కడ వేదిక, మైక్ ఏర్పాట్లన్నీ చేసింది ప్రభుత్వమేనని గుర్తు చేశారు.

నిమజ్జనం కార్యక్రమానికి వచ్చి, భక్తి గురించి మాట్లాడకుండా, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగునా? అని తలసాని నిలదీశారు. నాలుగైదు రోజుల నుంచి నిమజ్జన ఏర్పాటను కావాలనే రాజకీయం చేసినా, తాము మాట్లాడలేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కూడా మాట్లాడుతూ.. అసోం సీఎం చేసింది తప్పు.. బాధ్యతాయుత పదవిలో ఉండి ఏం మాట్లాడుతున్నారు? అని మండిపడ్డారు అసోం సీఎం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. నిమజ్జనం ఏర్పాట్లపై ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని వెల్లడించారు.

Exit mobile version