Site icon NTV Telugu

TRS Leader Nandu Bilal: సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. ఖబడ్దార్

Nandu Lal Warns

Nandu Lal Warns

TRS Leader Nandu Bilal Strong Warning To BJP Leaders: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. ఖబడ్దార్ అంటూ టీఆర్ఎస్ నేత నందుబిలాల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గణేశ్ ఉత్సవాలకు వచ్చారని.. ధర్మ కార్యక్రమానికి వచ్చిన ఆయన, రాజకీయాలు మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. సీఎం కేసీఆర్‌ని దూషించినందుకే మైక్ లాక్కొని అసోం సీఎంని అడ్డుకున్నామని, తమ నిరసన వ్యక్తం చేశామని చెప్పారు. గణేశ్ శోభయాత్రకు వచ్చిన అసోం సీఎం శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నారని.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే, తాము చూస్తూ ఊరుకోమన్నారు. నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా జరగనివ్వండని కోరారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై బీజేపీ నాయకుడు మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని నందుబిలాల్ హెచ్చరించారు.

కాగా.. గణేశ్ ఉత్సవ కమిటీలో సీఎం కేసీఆర్‌ని విమర్శించినందుకు, నందుబిలాల్ వెనక నుంచి ఒక్కసారిగా చొచ్చుకొని వచ్చి అసోం సీఎం హిమంత బిస్వా శర్మ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. మైక్ లాక్కొని, ఆయనతో వాగ్వాదానికి దిగారు. అప్పుడు ఉత్సవ కమిటీ సభ్యులు అప్రమత్తమై, నందుబిలాల్‌ను వేదిక నుంచి దించేశారు. అనంతరం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనపై మంత్రి తలసానితో పాటు హోంమంత్రి మహమూద్ అలీ తీవ్రంగా మండిపడ్డారు. గణేశ్ ఉత్సవాలకి వచ్చి భక్తి మాటలు మాట్లాడకుండా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరంలో చిచ్చు పెట్టేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని విమర్శించారు. అసోం సీఎం వ్యాఖ్యలు మరీ వల్గర్‌గా ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగానే ఆయన వ్యాఖ్యలు చేసినట్టు స్పష్టమవుతోందని అభిప్రాయపడ్డారు.

Exit mobile version