NTV Telugu Site icon

Traffic restrictions: రేపు కొత్త సచివాలయ ప్రారంభోత్సవం.. ఆ రూట్లల్లో వెళ్లి పరిషాన్‌ అవ్వకండి

Ts New Secretariat Building

Ts New Secretariat Building

Traffic restrictions: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం రేపు ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ తన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ఈ క్రమంలో సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఆదివారం నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ప్రధానంగా ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. పలు చోట్ల రహదారులను మూసివేసి వాహనాలను దారి మళ్లించనున్నారు. రేపు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సులను కూడా దారి మళ్లించనున్నారు.

Read also: Cyber Crime : 14 గ్రామాల్లో 5వేల మంది పోలీసులు దాడులు.. 2 లక్షల సిమ్ బ్లాక్‌లు.. 100 మందికి పైగా అరెస్టు

అఫ్జల్‌గంజ్ నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే బస్సులు ట్యాంక్‌బండ్‌కు బదులు తెలుగుతల్లి ఫ్లైఓవర్, కట్ట మైసమ్మ, లోయర్ ట్యాంక్ బండ్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ మీదుగా వెళ్తాయి. నెక్లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ ఘాట్‌, ఎన్టీఆర్‌ గార్డెన్‌, లుంబినీ పార్క్‌లను మూసివేయనున్నారు. పంజాగుట్ట, సోమాజిగూడ వైపు నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్‌ రోడ్డు వైపు, ఖైరతాబాద్‌ జంక్షన్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు, తెలుగుతల్లి జంక్షన్‌ వైపు వచ్చే వాహనాలను నెక్లెస్‌ రోడ్డు వైపు అనుమతిస్తారు. అలాగే చింతలబస్తీ నుంచి వచ్చే వాహనదారులను నెక్లెస్ రోడ్డు వైపు అనుమతిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బీఆర్‌కే భవన్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను అనుమతిస్తారు. సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. సుదర్శన యాగం, చండీ హోమం, వాస్తు హోమం నిర్వహించనున్నారు. ఉదయం మంత్రి ప్రశాంత్‌రెడ్డి దంపతులు ఈ హోమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం జరిగే పూజా కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. ఈ కార్యక్రమాల్లో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు. సచివాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
Cyber Crime : 14 గ్రామాల్లో 5వేల మంది పోలీసులు దాడులు.. 2 లక్షల సిమ్ బ్లాక్‌లు.. 100 మందికి పైగా అరెస్టు