TGSRTC Results : తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఈ పోస్టులకు సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TGPRB) సోమవారం అధికారికంగా విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపిక జాబితాతో పాటు వివిధ కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను కూడా బోర్డు తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు బోర్డు ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు.
1,604 మంది అభ్యర్థుల ఎంపిక
గతేడాది సెప్టెంబర్ 17న ఆర్టీసీలో మొత్తం 1,743 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా, అందులో అర్హత సాధించిన మొత్తం 1,604 మంది అభ్యర్థులను తుది జాబితాకు ఎంపిక చేశారు. ఇందులో 1,000 డ్రైవర్ పోస్టులకు గాను 894 మంది ఎంపికవ్వగా, డ్రైవింగ్ టెస్ట్‌కు సంబంధించిన మార్కుల షీట్లను అభ్యర్థుల లాగిన్‌లలో అందుబాటులో ఉంచారు. అలాగే 743 శ్రామిక్ పోస్టులకు గాను మొత్తం 710 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
అటెస్టేషన్ ఫారం దాఖలుకు కీలక తేదీలు
ఎంపికైన అభ్యర్థుల తుది నియామకం అనేది వారి క్యారెక్టర్, ప్రవర్తన వెరిఫికేషన్ , వైద్య పరీక్షల్లో సాధించే అర్హతపై ఆధారపడి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి అభ్యర్థులు ఆగస్టు 7న ఉదయం 8 గంటల నుంచి ఆగస్టు 11వ తేదీ అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్‌లో డిజిటల్ రూపంలో అటెస్టేషన్ ఫారాన్ని పూరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆగస్టు 17న మూడు కాపీల అటెస్టేషన్ ఫారాలతో పాటు, తమ సంబంధిత ధ్రువపత్రాలను ఆయా పోలీస్ జిల్లా లేదా కమిషనరేట్ కార్యాలయాల్లో నేరుగా సమర్పించాల్సి ఉంటుందని బోర్డు ఛైర్మన్ వెల్లడించారు. పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు వెంటనే వెబ్‌సైట్‌ను సందర్శించి తమ వివరాలను సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.

