Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ, వ్యాయామ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి (Telangana Council of Higher Education – TGCHE) శుభవార్త అందించింది. 2025-2026 విద్యా సంవత్సరానికి గాను TG Ed.CET-2025 (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ – B.Ed) , TG P.E.CET-2025 (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ – B.P.Ed, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ – D.P.Ed) అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది.
హైదరాబాద్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన అడ్మిషన్స్ కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. TGCHE చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైస్ చైర్‌పర్సన్‌లు ప్రొఫెసర్ ఇ. పురుషోత్తం, ప్రొఫెసర్ ఎస్.కె. మహమూద్, సెక్రటరీ ప్రొఫెసర్ ఎస్. వెంకటేష్, కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగ రెడ్డితో పాటు ఇతర కమిటీ సభ్యులు పాల్గొని కౌన్సెలింగ్ తేదీలపై చర్చించారు.
TG Ed.CET-2025 ముఖ్యమైన తేదీలు:
Ed.CET-2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 14వ తేదీన నోటిఫికేషన్ విడుదలతో ప్రారంభం కానుంది. అభ్యర్థులు జూలై 21, 2025 నుండి జూలై 31, 2025 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని, తమ ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక కేటగిరీలైన NCC / CAP / PH / Sports అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కోసం జూలై 23 నుండి జూలై 26, 2025 వరకు స్లాట్ బుకింగ్ ద్వారా జరుపుతారు.
అర్హులైన అభ్యర్థుల జాబితాను ఆగస్టు 2, 2025న ప్రదర్శించి, సవరణలకు అవకాశం కల్పిస్తారు. వెబ్ ఆప్షన్లను ఫేజ్-I కింద ఆగస్టు 4 , 5, 2025 తేదీల్లో వినియోగించుకోవచ్చు. వెబ్ ఆప్షన్ల సవరణకు ఆగస్టు 6, 2025న అవకాశం ఉంటుంది. తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితా కాలేజీ వారీగా ఆగస్టు 9, 2025న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. చివరిగా, ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 11 నుండి ఆగస్టు 14, 2025 వరకు కళాశాలల్లో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించి, ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తరగతులు తాత్కాలికంగా ఆగస్టు 18, 2025 నుండి ప్రారంభమవుతాయి.
TG P.E.CET-2025 ముఖ్యమైన తేదీలు:
P.E.CET-2025 కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా జూలై 14, 2025న నోటిఫికేషన్ విడుదలతో మొదలవుతుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ , ధ్రువపత్రాల అప్‌లోడ్ కోసం జూలై 23 నుండి జూలై 29, 2025 వరకు గడువు ఉంది. ప్రత్యేక కేటగిరీ ధ్రువపత్రాల పరిశీలన స్లాట్ బుకింగ్ ద్వారా జూలై 25 , 26, 2025 తేదీల్లో జరుగుతుంది.
అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రదర్శన , సవరణలకు అవకాశం జూలై 30, 2025న ఉంటుంది. వెబ్ ఆప్షన్ల వినియోగం (ఫేజ్-I) జూలై 31 , ఆగస్టు 1, 2025 తేదీల్లో జరపవచ్చు. ఆగస్టు 2, 2025న వెబ్ ఆప్షన్ల సవరణకు అవకాశం కల్పిస్తారు. తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితా కాలేజీ వారీగా ఆగస్టు 4, 2025న వెబ్‌సైట్‌లో ప్రదర్శించబడుతుంది. ఎంపికైన విద్యార్థులు ఆగస్టు 5 నుండి ఆగస్టు 8, 2025 వరకు కళాశాలల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించి, ట్యూషన్ ఫీజు చెల్లించాలి. తరగతులు తాత్కాలికంగా ఆగస్టు 11, 2025 నుండి ప్రారంభమవుతాయి.
అభ్యర్థులు తమ కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన మరింత సమాచారం కోసం Ed.CET వెబ్‌సైట్ http://edcetadm.tgche.ac.in , P.E.CET వెబ్‌సైట్ http://pecetadm.tgche.ac.in లను సందర్శించాలని అధికారులు సూచించారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించడానికి ఉన్నత విద్యా మండలి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించింది.
