Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే

  • CMR బకాయిలపై పౌర సరఫరాల శాఖ కఠిన చర్యలు
  • RR యాక్ట్ కింద బకాయిల వసూలుకు ప్రత్యేక డ్రైవ్
  • అక్టోబర్ 5 నుంచి అధికారులకు ప్రత్యేక శిక్షణ
  • షోకాజ్ నోటీసులకు 7 రోజుల్లో సమాధానం ఇవ్వాల్సిందే
Rice Millers

Rice Millers

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి రైస్ మిల్లర్లు ఇవ్వాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) బకాయిలపై పౌర సరఫరాల శాఖ తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రజల సొమ్ముతో కనీస మద్దతు ధర (MSP) చెల్లించి కొనుగోలు చేసిన ప్రభుత్వ ధాన్యాన్ని అప్పగించకుండా దారి మళ్లించాలని చూసే డిఫాల్ట్ మిల్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వానికి రావలసిన బియ్యాన్ని తక్షణమే అప్పగించాలని, లేకపోతే ఆస్తులను కోల్పోవడానికి సిద్ధపడాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. రెవెన్యూ రికవరీ (RR) చట్టం ప్రకారం బకాయిలు ఉన్న మిల్లర్ల నుంచి నిధులను రాబట్టడంతో పాటు ఆస్తులను వేగంగా స్వాధీనం చేసుకోవడానికి పౌర సరఫరాల శాఖ ప్రత్యేక డ్రైవ్‌కు శ్రీకారం చుట్టింది.

7 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సిందే

చట్టపరమైన చిక్కులు ఎదురుకాకుండా, ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా డిఫాల్ట్ మిల్లర్ల ఆస్తులను వేగంగా జప్తు చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పౌర సరఫరాల అధికారులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ అక్టోబర్ 5వ తేదీ నుంచి హైదరాబాద్‌లోని ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి (MCRHRD) సంస్థలో ఈ ప్రత్యేక శిక్షణ ప్రారంభం కానుంది. ఈ తనిఖీల ప్రక్రియను మరింత పటిష్టం చేస్తూ ప్రభుత్వం కొత్త నిబంధనలను సైతం తీసుకొచ్చింది. అధికారుల అకస్మాత్తు తనిఖీలలో గోదాముల్లో ఉండాల్సిన దానికంటే ధాన్యం నిల్వలు తక్కువగా ఉన్నట్లు తేలితే తక్షణమే పౌర సరఫరాల శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేస్తుంది. నోటీసు అందుకున్న మిల్లర్లు కేవలం ఏడు రోజుల గడువులోనే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సదరు గడువు దాటితే ఎలాంటి మినహాయింపులు లేకుండా నేరుగా ఆస్తుల జప్తుతో పాటు కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.