Site icon NTV Telugu

Telangana : గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు రతన్ టాటా పేరు

Ratan Tata

Ratan Tata

Telangana : హైదరాబాద్‌లో మౌలిక వసతులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రావిర్యాల వద్ద ఉన్న నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును ప్రతిపాదిత రేడియల్ రింగ్ రోడ్డుతో (RRR) కలుపుతూ నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు పద్మభూషణ్ రతన్ టాటా పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశ పారిశ్రామిక రంగానికి ఆయన అందించిన విశేష సేవలకు గౌరవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

అదే విధంగా, ప్లానెట్ ఎర్త్ ఫర్ ఫస్ట్ అనే కాన్సెప్ట్‌ కింద మరో ముఖ్యమైన రహదారికి అమెరికా 45వ , 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని ప్రతిపాదించారు. హైదరాబాద్‌లోని యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్ జనరల్ వెంటుగా ఉన్న హైప్రొఫైల్ రహదారిని ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా పిలవాలని యోచిస్తున్నారు. ఈ ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు యునైటెడ్ స్టేట్స్ ఎంబసీకి లేఖలు రాసి అధికారికంగా తెలియజేయనుంది. అంతర్జాతీయ సంబంధాలు, పరస్పర సహకారం దృష్టిలో పెట్టుకుని ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన వార్షిక US–India Strategic Partnership Forum (USISPF) కాన్‌క్లేవ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ సందర్భంగా హైదరాబాద్‌లోని ముఖ్యమైన రహదారులకు ప్రపంచ స్థాయి ప్రముఖులు, సంస్థల పేర్లు పెట్టాలని ఆయన ప్రతిపాదించారు.

దీనిలో భాగంగా, గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్‌కు గుర్తింపుగా ఒక ప్రధాన విస్తరణ మార్గానికి ‘గూగుల్ స్ట్రీట్’ అనే పేరు పెట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో, అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద క్యాంపస్‌గా నిర్మించనున్న రాబోయే ప్రాంగణానికి చేరుకునే రహదారిని ఈ పేరుతో గుర్తించనున్నారు. ప్రపంచ ఆవిష్కరణలు, పెట్టుబడులు, టెక్నాలజీ హబ్‌గా తెలంగాణను నిలపాలనే ప్రభుత్వ దృక్పథంలో భాగంగా ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చారు. విశిష్ట వ్యక్తులు, అంతర్జాతీయ సంస్థలకు గౌరవం , గుర్తింపుగా మరికొన్ని ముఖ్యమైన రహదారులకు పేర్లు పెట్టే అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Sukumar: డైరెక్టర్ సుకుమార్ రంగస్థలం కథను ఫస్ట్ ఇతనికే చెప్పాడు..

Exit mobile version