Site icon NTV Telugu

Telangana CMO: సెక్రటేరియట్ పనుల్ని పరిశీలించిన సీఎం కేసీఆర్.. ఆలస్యం కావొద్దని ఆదేశాలు

Kcr Secretariat Works

Kcr Secretariat Works

Telangana CM KCR Inspects Secretariat Construction Works And Orders To Speed Up Work: నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ నిర్మాణ పనులను తెలంగాణ సీఎం కేసీఆర్ పరిశీలించారు. నిర్మాణాలన్నింటినీ నిశితంగా పరిశీలించిన ఆయన.. నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా, నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని R&B మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్‌లోని అన్ని విభాగాల పనుల్ని అద్భుతంగా, సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. తొలుత నిర్దేశించుకున్న డిజైన్ల ప్రకారం పనులు జరుగుతున్నాయా? అని అడిగి తెలుసుకున్న కేసీఆర్.. ఏకకాలంలో పనులన్నీ వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆలస్యం కావద్దని పేర్కొన్నారు.

స్లాబుల నిర్మాణం, భవనం పైన డూమ్స్ ఏర్పాటు, ఇంటీరియర్ పనులతోపాటు ఫర్నీచర్ విషయంలో నూతన మోడల్స్ ఎంపిక చేసుకోవాలని కేసీఆర్ తెలిపారు. మంత్రుల ఛాంబర్లు, మీటింగ్ హాల్స్, యాంటీ రూమ్స్ నిర్మాణ పనులకు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. భవనం మధ్య భాగంలో సుమారు 2 ఎకరాల ఖాళీ స్థలంతోపాటు, సెక్రటేరియట్ ప్రాంగణంలో గ్రీనరీ, ల్యాండ్ స్కేపింగ్ పనులు అద్భుతంగా ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. గ్రిల్స్, రెడ్ స్టోన్, డ్రైనేజీ పనులపై ఆరా తీసిన ఆయన.. విజిటర్స్ లాంజ్, సెక్రటేరియట్ వాల్ వెంబడి మట్టి ఫిల్లింగ్ పనులను త్వరగా కానివ్వాలన్నారు. సెక్రటేరియట్‌కు వచ్చే విదేశీ ప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సందర్శకులకు సౌకర్యవంతంగా ఉండేలా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే.. మంత్రులు, సెక్రటరీలు, ఆయా శాఖల సిబ్బంది సౌకర్యవంతంగా పనులు చేసుకునేందుకు వీలుగా ఛాంబర్ల నిర్మాణం చేపట్టాలన్నారు.

కాగా.. సెక్రటేరియట్ పనుల పరిశీలనలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కె.పి.వివేకానంద, బేతి సుభాష్ రెడ్డి, ఎ.జీవన్ రెడ్డి, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ వేద సాయిచంద్, ఆర్.అండ్.బి ఈఎన్సీ గణపతిరెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రాంమ్మోహన్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Exit mobile version