Sun Pariwar Scam: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘సన్ పరివార్’ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తును వేగవంతం చేసి, తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. అధిక వడ్డీలు, భారీ లాభాల పేరిట సామాన్య , మధ్యతరగతి ప్రజలను నమ్మించి సుమారు 158 కోట్ల రూపాయల మేర మోసం చేసినట్లు ఈడీ పక్కా ఆధారాలతో నిర్ధారించింది. ఈ కుంభకోణానికి సూత్రధారి అయిన మెతుకు రవీందర్ ప్రస్థానం ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా ప్రారంభమైనప్పటికీ, అతి తక్కువ కాలంలోనే కోట్లకు పడగలెత్తాలనే దురాశతో వేలాది మంది జీవితాలను చిన్నాభిన్నం చేశారు. టీచర్‌గా తన వృత్తిని వదిలిపెట్టి పూర్తిస్థాయిలో వడ్డీ వ్యాపారంలోకి దిగిన రవీందర్, ప్రజల బలహీనతలను పెట్టుబడిగా మార్చుకున్నారు.
మెతుకు రవీందర్ , అతని సన్నిహితులు ‘సన్ పరివార్ గ్రూప్’, ‘సన్ మ్యూచువల్లీ ఎయిడెడ్ త్రిఫ్ట్ అండ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్’ వంటి సంస్థల ద్వారా డిపాజిట్లను సేకరించారు. తమ వద్ద డబ్బులు పెడితే ఏడాదికి ఏకంగా 100 శాతం వరకు రిటర్న్స్ ఇస్తామని, అంటే పెట్టిన పెట్టుబడి ఏడాదిలోనే రెట్టింపు అవుతుందన్న అసాధ్యమైన వాగ్దానాలతో సుమారు 10,000 మందిని బుట్టలో వేసుకున్నారు. ఈ భారీ స్కామ్‌ను నడపడానికి రవీందర్ ఒకదాని వెనుక ఒకటిగా డొల్ల కంపెనీల జాలాన్ని సృష్టించారు. మెతుకు చిట్ ఫండ్స్, మెతుకు వెంచర్స్, మెట్‌సన్ నిధి లిమిటెడ్, , మెతుకు హెర్బల్ లిమిటెడ్ వంటి సంస్థలను స్థాపించి, ప్రజల నుండి వసూలు చేసిన సొమ్మును ఒక కంపెనీ నుండి మరో కంపెనీకి మళ్లిస్తూ దర్యాప్తు సంస్థల కళ్లుగప్పే ప్రయత్నం చేశారు.
ఈడీ దర్యాప్తులో వెలుగుచూసిన మరో విస్తుపోయే నిజం ఏమిటంటే, సేకరించిన 158 కోట్ల రూపాయలలో సుమారు 26 కోట్ల రూపాయలను రవీందర్ తన వ్యక్తిగత అవసరాలకు , తన కుటుంబ సభ్యుల విలాసాల కోసం నేరుగా వాడుకున్నారు. అమాయక డిపాజిటర్ల సొమ్ముతో తన పేరిట, తన అనుచరుల పేరిట భారీగా స్థిరాస్తులను కూడబెట్టారు. పాత కంపెనీలపై ఎప్పుడైనా ఆరోపణలు లేదా పోలీసు కేసులు నమోదైనప్పుడు, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన సన్నిహితుల పేర్ల మీద ‘పుడమి ఆగ్రో ఫామ్ ల్యాండ్స్’, ‘పుడమి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్’, , ‘డివైన్ ఇన్‌ఫ్రా డెవలపర్స్’ వంటి కొత్త పేర్లతో సంస్థలను ప్రారంభించి మళ్లీ కొత్త పొంజీ స్కీమ్‌లను ప్రవేశపెట్టడం ఇతని మోసపూరిత ధోరణికి అద్దం పడుతోంది.
తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ, రవీందర్ అక్రమంగా సంపాదించిన 25.20 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఇప్పటికే అటాచ్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA-2002) కింద దాఖలైన ఈ ప్రాసిక్యూషన్ ఫిర్యాదును 2025 డిసెంబర్ 10న రంగారెడ్డిలోని ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించింది. కోట్లాది రూపాయల ‘నేరపూరిత ఆదాయం’ మళ్లించిన ఈ కేసులో తదుపరి దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ప్రజల కష్టార్జితాన్ని లూటీ చేసిన ఇటువంటి ఘరానా మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇటువంటి స్కామ్‌లు జరగకుండా అడ్డుకోవచ్చని బాధితులు ఆశిస్తున్నారు.
