Srinivas Goud Priaises CM KCR Over Bathukamma Celebrations: గతంలో బతుకమ్మ ఆడుకోవాలంటే అనేక ఆంక్షలు ఉండేవని.. ఇప్పుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో అధికారికంగా వేడుకలు జరుపుకుంటున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో 45 దేశాల్లో బతుకమ్మ వేడుకలు జరిగాయన్నారు. తెలంగాణలో గొప్ప సంస్కృతి, సంప్రదాయలు ఉన్నాయని.. తెలంగాణ తెచ్చిన వ్యక్తి సీఎం అవ్వడం వల్లే మన పండుగులకు గౌరవం దక్కుతోందని పేర్కొన్నారు. గతంలో తెలంగాణకు పంజాబ్ నుంచి బియ్యం వచ్చేవని.. ఇవాళ మనమే మిగిలిన రాష్ట్రాలకు అన్నం పెట్టే స్థాయికి చేరుకున్నామన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు. సన్సద్ ఆదర్శ యోజనలో మొత్తం 20 అవార్డులు ఉంటే.. అందులో 19 తెలంగాణకే వచ్చాయన్నారు. అలాగే స్వచ్ఛ భారత్ అవార్డుల్లో తెలంగాణకు 13 వచ్చాయని.. ఇటీవల పర్యాటక రంగంలో నాలుగు జాతీయ పురస్కారాలు దక్కాయని చెప్పారు. అనేక రంగాల్లో తెలంగాణ సర్వోతోముఖాభివృధ్ది సాధిస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
అంతకుముందు పర్యాటక రంగంలో తెలంగాణకు నాలుగు జాతీయ పురస్కారాలు వచ్చినప్పుడు, రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. అప్పట్లో తెలంగాణలో తాగునీరు, కరెంట్ లేకపోవడంతో వలసలు వెళ్లేవారని.. ఇప్పుడు దేశ అభివృద్ధిలో, జిడిపి పెంపులో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కరోనా సహా అనేక రకాల వ్యాధులకు సంబంధించిన మందులన్నీ తెలంగాణ నుంచే వెళ్తున్నాయన్న ఆయన.. దేశంలో 24 గంటల కరెంట్, ఇంటింటికి మంచినీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. సీఎం కేసీఆర్ పరిపాలనతో దేశానికి మంచి పేరు వచ్చిందన్నారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా.. రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు.
