Sensational Truths Revealed In Nayeem Main Aide Sheshanna Remand Report: గ్యాంగ్‌స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే! ఒక రెస్టారెంట్‌లో సెటిల్‌మెంట్ చేస్తుండగా.. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. నయీం ఎన్‌కౌంటర్ తర్వాత ఆరున్నర సంవత్సరాలుగా శేషన్న అజ్ఞాతంలో ఉన్నాడు. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత పట్టుబడ్డాడు. నానక్‌రాంగూడ నుంచి గచ్చిబౌలికి వెళ్తున్న సమయంలో.. శేషన్నని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇప్పుడు అతనిపై రిమాండ్ రిపోర్ట్ సిద్ధం చేయగా.. అందులో శేషన్నకు సంబంధించి సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
శేషన్న మొత్తం పది కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టుగా తేలింది. అచ్చంపేటలో 2 కేసులుండగా.. నారాయణ పేట, సుల్తాన్ బజార్, పహాడి షరీఫ్‌లలో ఒక్కోటి చొప్పున కేసులున్నాయి. అలాగే.. ఆయుధాల చట్టం కింద నాలుగు కేసులున్నట్టు వెల్లడైంది. ఇతను అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని, చాలా షెల్టర్స్ ఉన్నాయని, పారిపోయే ప్రమాదం కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. శేషన్న ఎన్నో నేరాలకు పాల్పడ్డాడని, ఆయుధాలు చూపించి బెదిరించేవాడని తెలిసింది. 1993లోనే శేషన్నపై మొదటి ఎఫ్ఐఆర్ నమోదైంది. అతడ్ని మొదటిసారి సనత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ వ్యాస్, కొనపురి రాములు, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రావు, శ్రీధర్ రెడ్డి, కనకాచారి టీచర్, రాములు హత్య కేసుల్లో శేషన్న ప్రధాన నిందితుడు. కొన్ని అక్రమ ఆయుధాల కేసుల్లో సైతం నిందితుడుగా ఉన్నట్టు వెలుగులోకొచ్చింది.
నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితులైన శేషన్న.. విద్యార్థి దశలోనే నక్సల్ బరిలో చేరాడు. ఇతనికి రెండు పెళ్లిళ్లు కాగా.. ఐదుగురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. అప్పటి కమాండర్ శాఖమూరి అప్పారావు ఇతనికి నాలుగున్నర లక్షలు ఇచ్చారని.. అందులో 50 వేలు పెట్టి ఆటో కొనుగోలు చేసి, మిగతా నాలుగు లక్షల్ని తన వద్దే ఉంచుకున్నట్టు పోలీసులు గుర్తించారు. శేషన్నతో పాటు భార్య నర్సమ్మ కూడా ఐపీఎల్ హత్య కేసులో నిందితులని తేలడంతో.. ఆమెపై కూడా టాడా చట్టం క్రింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో శేషన్న దంపతులు ముషీరాబాద్ జైల్లో శిక్ష అనుభవించారు. ఆ జైల్లోనే శేషన్నకు నయీంతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి నయీం కనుసైగల్లో హత్యలు, కిడ్నాప్‌లు, ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తూ వచ్చాడు. నయీంతో కలిసి అనేక నేరాలకు పాల్పడ్డాడు. అయితే.. నయీం ఎన్‌కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లాడు.
15 మంది నక్సల్ కమాండర్స్‌తో పని చేసిన శేషన్నకు.. మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు విచారణలో భాగంగా పోలీసులకు తేలింది. మావోయిస్టులకు కొరియర్‌గా, డెన్ కీపర్‌గా శేషన్న పని చేశాడు. శేషన్నను అరెస్ట్ చేసిన సమయంలో.. అతని వద్ద నుంచి 9 MM పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
