మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలతో పాటు పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న జూనియర్ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను కూడా అభివృద్ధి చేసి బలోపేతం చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో మన ఊరు-మన బడి కార్యక్రమం అమలుపై విద్యాశాఖ మంత్రి, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అన్ని ప్రభుత్వ, స్థానిక పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమం మొదటి దశ కింద రాష్ట్రవ్యాప్తంగా 26,000 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 9,123 పాఠశాలలు గుర్తించబడ్డాయని, పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ)లు ప్రమేయంతో అభివృద్ధి పనులు అమలు చేయబడతాయని వారు వెల్లడించారు.
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా చేసే ప్రతి పనిపై సామాజిక తనిఖీలు, అధికారుల తనిఖీలు ఉంటాయని మంత్రులు తెలిపారు. ఈ కార్యక్రమం అమలు కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్‌లు, ఎస్‌ఎంసీలతో మూడు సార్లు సమావేశాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి ఉన్నత పాఠశాలలో గ్రంథాలయం ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం కింద పేర్కొన్న 12 అంశాల ఆధారంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను మంత్రులు సూచించారు.
