NTV Telugu Site icon

Revanth Reddy Letter to CM KCR: వారి సమస్యలు పరిష్కరించండి.. సీఎం కు రేవంత్ రెడ్డి లేఖ

Revanthreddy, Kcr

Revanthreddy, Kcr

Resolve vro problems.. Revanth Reddy letter to CM Kcr: గ్రామ రెవెన్యూ సహాయకులు (VRA) సమస్యల పరిష్కారం గురించి సీఎం కేసీఆర్‌ కు మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మీ ప్రభుత్వంలో వీఆర్ఎల బతుకులు అగమ్యగోచరంగా మారాయని విమర్శించారు. వారి అకాల మరణాలు, ఆత్మహత్యలు నిత్యకృత్యం కావడం బాధాకరం. వాళ్లతో గొడ్డు చాకిరీ చేయించుకోవడమే తప్ప, వారి హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. తమ సమస్యలను పరిష్కరించావని, ఉద్యోగ భద్రత కల్పించాలని మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రిగా మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వీఆర్ఏలు గత 48 రోజలుగా సమ్మె చేస్తున్నారని, ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయిన మీ రాక్షస ప్రభుత్వంలో చలనం లేకపోవడం అత్యంత బాధాకరమని మండిపడ్డారు.

గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ)కు పే స్కేల్‌ఇస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా 2020, సెప్టెంబర్ 9న మీరు హామీ ఇచ్చి సరిగ్గా రెండేళ్లు దాటిందని గుర్తు చేశారు. “ఇకపై వీఆర్వోలు ఉండరు. విద్యార్హతలు కలిగిన వీఆర్‌ఏలకు పే స్కేల్‌అమలు చేస్తామన్నారు, ఉన్నత విద్యార్హతలు ఉన్న వారికి పదోన్నతులు కల్పిస్తా మన్నారు. 55 ఏళ్లు నిండితే వారి పిల్లలకు వారసత్వంగా వీఆర్‌ఏలుగా అవకాశం కల్పిస్తాం అంటూ ఆ సందర్భంగా హామీలు గుప్పించారని గుర్తు చేశారు. మీ హామీలను చూసి వీఆర్ఏలు ఉబ్బితబ్బిబ్బయ్యారని అన్నారు. జీవితాలు మారిపోతాయని ఆశపడ్డారని రేవంత్‌ రెడ్డి అన్నారు. పే స్కేల్‌ అమలు చేస్తే రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా వేతనం వస్తుందని ఆశ పడ్డారని తెలిపారు. పీఆర్సీ అమలు చేసినప్పుడల్లా జీతాలు పెరుగుతాయని భావించారని అన్నారు.

ఇతర శాఖల్లోని ఉద్యోగుల తరహాలోనే పదోన్నతులు వస్తాయని ఆశించారు. మరీ ముఖ్యంగా ఉద్యోగానికి భద్రత ఉంటుందని భావించారు. కానీ మీరు యదావిధిగా మాటతప్పారని మండిపడ్డారు. ఉదారంగా హామీలు ఇవ్వడమే తప్ప, వాటిని అమలు చేసే చిత్తశుద్ధి మీకు ఎప్పుడూ లేదని విమర్శించారు. వీఆర్ఎల విషయంలో సైతం అదే ధోరణిని ప్రదర్శించారని అన్నారు. ముఖ్యమంత్రి మాటకే విలువ లేదని… గత్యంతరం లేని పరిస్థితుల్లో, తమ బతుకుతెరువును కాపాడుకోవాలన్న ఆందోళనతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23 వేల మంది వీఆర్‌ఏలు సమ్మె బాట పట్టారు. సమ్మెకు దిగి శనివారం నాటికి 48 రోజులు పూర్తయిందని అన్నారు. వీఆర్‌ఏలు సమ్మెకు వెళ్లడంతో అప్పటి నుంచి ప్రభుత్వం రూ. 10,500 గౌరవ వేతనం కూడా నిలిపేసిందని పేర్కొన్నారు. ఓవైపు, రెండు నెలలుగా జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు.

మరోవైపు, ఉద్యోగం ఉంటుందో ఉండదోననే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే, ఇప్పటి వరకూ 28 మంది వీఆర్‌ఏలు చనిపోయారని గుర్తు చేశారు. దాదాపు రెండు రోజులకు ఒకరు చొప్పున మృత్యువాత పడ్డారని మండిపడ్డారు. వీరంతా నడి వయసు వారే కావడం మరో విషాదమన్నారు. ఈ కుటుంబాలకు దిక్కెవరు? మాట ఇచ్చిన తప్పిన మీరే ఈ చావులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని డిమాండ్‌ చేశారు. మీ పాలనలో వీఆర్ఏలు ఉపాధి హామీ కూలీల కంటే ధీనమైన పరిస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లకేళ్లు కష్టం చేసినా ప్రమోషన్లు రావు, ప్రయోషన్ల కోసం ఎదురు చూసి వయసు పరిధి దాటి పోవడంతో మరో ఉద్యోగానికి వెళ్లలేక, ఉన్న కొలువులో బతుకు బండి నడపలేక నరకయాతన అనుభవిస్తున్నారని అన్నారు.

పేరుకే పార్ట్ టైమర్లు తప్ప… ఫుల్ టైమర్ల కంటే ఎక్కువ పని భారాన్ని మోస్తున్న వ్యవస్థ ఏదైనా ఉందంటే అది వీఆర్ఎల వ్యవస్థే. వీఆర్ఏల్లో 90 శాతం బీసీలు, దళిత వర్గాల బిడ్డలే ఉన్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 30 రకాల విధులను వీఆర్ఎలు నిర్వర్తిస్తున్నారంటేనే వీరి అవసరం, పాత్ర ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. 2020లో మీ ప్రభుత్వం వీఆర్ఓల వ్యవస్థను రద్దు చేయడంతో వీఆర్ఎల పై పని భారం మరింత పెరిగిందని అన్నారు. చాలీచాలని జీతం మరోవైపు తీవ్ర పని ఒత్తిడితో కొందరు వీఆర్ఎలు గుండెపోటుకు గురై చనిపోతున్నారని అన్నారు. గతంలో నిజామాబాద్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వీఆర్ఎలు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు నమోదయ్యాయని అన్నారు.

ఇంత జరిగినా మీరు సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోగా దేశాన్ని ఉద్దరిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. వీఆర్ఏల బతుక్కు భరోసా ఇవ్వలేని మీరు భారదేశాన్ని ఉద్దరిస్తారా? వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ శేషాద్రి ఛైర్మన్ గా నియమించిన కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదంటేనే అది కంటి తుడుపు కమిటీ అని అర్థమవుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకే దిక్కులేకపోతే రాష్ట్రంలో పాలన ఉన్నట్టా లేనట్టా!? అందుకే వీఆర్ఎలు వాళ్ల సమస్యల పరిష్కారం కోసం రోడెక్కే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణం మీరే. ఇప్పటికైనా వాళ్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చండని అన్నారు. లేనిపక్షంలో వీఆర్ఎల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్ధతుగా నిలవడమే కాక… వారి తరపున ప్రత్యక్ష కార్యచరణకు సైతం సిద్ధమవుతామని అన్నారు.

Show comments