Ponnala Lakshmaiah Fires On BJP TRS Parties: కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తాజాగా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ని ఉద్దేశిస్తూ.. ఫాంహౌస్‌లో ఉండి రాజకీయం చేసేవాళ్లు, దేశాన్ని ఎలా బాగు చేస్తారని కౌంటర్ వేశారు. రాహుల్ గాంధీ చేస్తోన్న భారత్ జోడో యాత్రపై టీఆర్ఎస్‌కు మాట్లాడే నైతిక హక్కు లేదని, సరైన సమయంలో కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. ఇదే సమయంలో ఆయన బీజేపీపై కూడా మండిపడ్డారు. రాహుల్ యాత్రపై బీజేపీకి మాట్లాడే అర్హత లేదన్న ఆయన.. బీజేపీ నాయకులు స్వాతంత్రం కోసం పోరాడారా? మూడు రంగుల జెండా పట్టుకొని తిరిగారా? అని ప్రశ్నించారు. ‘విభజించాలి, పాలించాలి, పరిపాలనలోకి రావాలి’ అనేదే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఉద్దేశమని విమర్శించారు. స్వాతంత్రం రాకముందు దేశం సంపన్నదేశంగా ఉండేదని, కానీ ఇప్పుడు అప్పులపాలయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక రాహుల్ గాంధీ యాత్ర గురించి మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర ఈ శతాబ్దంలోనే చారిత్రాత్మకమైందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఈ యాత్ర కీలకమైన మూడో ఘట్టమని పేర్కొన్నారు. అప్పట్లో మహాత్మా గాంధీ చేపట్టిన దండి పాదయాత్ర, ఉప్పు సత్యాగ్రహ యాత్ర స్వాతంత్య్ర పోరాటానికి ఎలాగైతే ఊపునిచ్చాయో.. ఇప్పుడు భారత్ జోడో యాత్ర దేశ ప్రజలకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తోందన్నారు. అంతకుముందు.. మునుగోడులో ఓట్ల కోసమే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని మొయినాబాద్ ఫాంహైస్ ఎపిసోడ్‌పై పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. చిత్తశుద్ది ఉంటే ప్రజాస్వామ్యబద్ద రాజకీయాలు చేయాలని.. కానీ డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమనేది దుర్మార్గమైన చర్య అని ఆగ్రహించారు. బీజేపీ, టీఆర్ఎస్ చేసినట్లే.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉంటే, ఆ రెండు పార్టీలు అసలు ఉండేవే కావన్నారు. ఇలాంటి వాటిని నివారించేందుకే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చిందన్నారు.
