NTV Telugu Site icon

No Foreign Birds : విదేశీ అతిథులకు ఇక సెలవు!

అది విదేశీ పక్షులకు నెలవు. అక్కడకు ప్రతి ఏటా విదేశీ పక్షులు రావడం.. ఇక్కడనే గుడ్లను పెట్టి పొదిగి.. వాటిని పెంచి.. ఆ పిల్లలతో సహా ఇక్కడ నుంచి మళ్లీ తమ ప్రదేశాలకు వెళ్లడం ప్రతి యేటా సాగుతుంది. అయితే అవి నివాసం ఉంటున్న చింత చెట్లు లేక.. మరోవైపున కోతుల బెడదతో ఆ గ్రామానికి విదేశీ పక్షుల రాక బంద్ అయింది.. అటు పర్యాటక గ్రామంలో తయారుచేస్తామన్న అధికారుల మాటలు నీటి మూటలుగా తయారయ్యాయి.

ఖమ్మం జిల్లా చింతపల్లి గ్రామానికి ఎప్పటి నుంచో విదేశీ వలస పక్షులు రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడా పక్షుల రాక నిలిచిపోయింది. ఒక్కటి రెండు పక్షులు వస్తున్నప్పటికి అవి ఇక్కడ పరిస్థితి చూసి వెనకకు వెళ్లిపోతున్నాయి. ఇక్కడ విదేశీ పక్షులకు అలవాలంగా ఉండే చింత చెట్లు లేకుండా పోయాయి. అదే విధంగా ఇప్పుడు కోతుల బెడద కూడా తీవ్రంగా తయారైంది. దీంతో ఇప్పుడు విదేశీ పక్షులకు సమస్యగా మారిపోయింది.

గతంలో చింతపల్లి గ్రామంలో చింతచెట్లు నిండుగా ఉండేవి. ఆ చింత చెట్ల మీదకు సైబీరియా పక్షులు తరలి వచ్చేవి. ప్రతి యేటా జనవరి నుంచి జూలై వరకు ఇక్కడకు సైబీరియా నుంచి చుట్టాలు వచ్చినట్లుగా వచ్చి పోతుంటాయి. ఇక్కడ చింత చెట్ల మీద గూళ్లు పెట్టుకుని మళ్లీ పిల్లలను చేసి వెళ్లిపోతుంటాయి. సైబీరియా కొంగలు ఎక్కడ నుంచో ఇక్కడకు వచ్చి పిల్లలను కని వాటిని తీసుకుని తిరిగి వెళుతుంటాయి. అయితే ఇప్పుడు చెట్లను కొట్టివేయడంతో పాటు, కోతుల సమస్య వచ్చి చేరింది. వేల కిలోమీటర్ల దూరం నుంచి సైబీరియా కొంగలు ఖమ్మం జిల్లా చింతపల్లికి వస్తాయి. డిసెంబర్ లో పైలెట్ కొంగలు వచ్చి, పరిస్థితిని పరిశీలించి తిరిగి వెళ్లి తమ సహోదరులను తీసుకుని వస్తుంటాయి.

పొడవాటి కాళ్లు, ముక్కు కలిగి ఉన్న అయిదు నుంచి పది కిలోల పరిమాణంలో ఉంటాయి. సైబీరియా కొంగల వల్ల గ్రామంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి గ్రామస్తులు మాత్రం వాటిని ఆత్మీయంగానే చూసుకున్నారు. కొంగలపై ఎవ్వరైనా దాడి చేస్తే గ్రామస్తులు పైన్ కూడా వేస్తారు. తమ గ్రామానికి కొంగల వల్ల మంచి పేరు రావడంతో ఆ గ్రామస్తులు హర్షిస్తున్నారు. అయితే ఇలా వచ్చిన కొంగలు ఒక్కొక్క జంటగా వచ్చి పిల్లలను తీసుకుని వెళ్లడం ప్రతి యేటా జరుగుతుంది.

గత కొంత కాలంగా కోతుల బెడద పెరిగిపోయింది. ఖమ్మం జిల్లా వ్యాపితంగా ఈ కోతుల బెడద ఎక్కువగా ఉంది. దీంతో ఇప్పుడు ఈ కోతులు చింతపల్లి గ్రామంపై కూడా దండెత్తాయి. కొన్ని కారణాల వల్ల కొంతమంది చింత చెట్లను నరికి వేశారు. అదే విధంగా కోతుల బెడద వల్ల కూడా కొంత మంది ఈ చెట్లను కొట్టివేశారు. చింత చెట్లను కోతులు ఎక్కి చింత కాయలను తెంపడం, నానా రభస చేయడం జరుగుతుంది. దీంతో వాటి బారిన పడలేక చింత చెట్లను కూడా తీసేశారు గ్రామస్తులు.

ఇక్కడకు వచ్చిన సైబీరియా కొంగల మీద కోతుల దాడులు ఎక్కువయ్యాయి. కోతులు చెట్ల కొమ్మల మీదకు ఎక్కి కొంగల వెంట పడుతున్నాయి. కోతులు గుడ్లను పెట్టి, తిరిగి ఆహారం వేట కోసం చెరువుల వైపు వెళ్తాయి. ఈసందర్బంగా అక్కడకు వచ్చిన కోతులు కొంగల గుడ్లను పగులకొట్టడం, కొంగల ఆశ్రయాలను నాశనం చేయడం చేస్తున్నాయి. దీంతో కొంగలు అక్కడ నివసించడం కష్టతరంగా మారిపోయింది. చిన్న చిన్న కొంగ పిల్లలు క్రిందపడిపోయి చనిపోతున్నాయి. కోతి చేష్టల ముందు కొంగలు తట్టుకోలేకపోతున్నాయి. విదేశీ పక్షుల వల్ల చింతపల్లి గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అయితే ఈ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని అధికారులు హామీలు ఇచ్చారు. అయితే వారి హామీలను మాత్రం నెరవేర్చలేదు. ఇప్పుడు గ్రామంలో కోతుల బెడద వల్ల ఆ కొంగలు కూడా రాకుండాపోయాయి.