NTV Telugu Site icon

MP Badugula Lingaiah: రాజగోపాల్‌రెడ్డి.. దొంగ దీక్షలు, ధర్నాలు మానుకో

Mp Lingaiah On Rajagopal

Mp Lingaiah On Rajagopal

MP Badugula Lingaiah Yadav Fires On Rajagopal Reddy: గొల్ల కురుమలకు నిధులు ఇవ్వడం లేదంటూ రాజగోపాల్‌రెడ్డి దొంగ నాటకాలు ఆడుతున్నాడని ఎంపీ బడుగులు లింగయ్య యాదవ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పివరకూ మునుగోడు నియోజకవర్గంలో 7,600 మంది గొల్ల కురుమల అకౌంట్లలో డబ్బులు పడ్డాయని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గొల్ల కురుమల కోసం తెలంగాణ ప్రభుత్వం పథకాలు తీసుకొచ్చిందని, రూ.12 వేల కోట్లతో 75 వేల కుటుంబాలకు లక్షల సంఖ్యలో గొర్రెలు అందజేసిందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడుతలో గొర్ల కొనుగోలుకు కూడా డబ్బులు అందజేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. కానీ.. బీజేపీ, రాజగోపాల్‌రెడ్డి మాత్రం మునుగోడు నియోజకవర్గంలో గొల్ల కురుమలకు నిధులు రాకుండా ఆపేశారంటూ అబద్ధప్పు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ఎన్నికల సంఘానికి వాళ్లు ఫిర్యాదు చేసి.. గొల్ల కురుమలపై కుట్ర పన్ని, డబ్బలు రాకుండా ఆపేశారన్నారు. ఇప్పుడేమో నిధులు ఇవ్వట్లేదంటూ ధర్నాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.

నిజానికి.. గొల్ల కురుములకు అన్యాయం చేసిందే బీజేపీ పార్టీ అని లింగయ్య యాదవ్ ఆరోపించారు. ఇకనైనా రాజగోపాల్‌రెడ్డి దొంగ దీక్షలు, ధర్నాలు మానుకోవాలని హితవు పలికారు. ఇప్పటికే మునుగోడు ప్రజలు రాజగోపాల్‌రెడ్డిని తిరస్కరించారన్నారు. గతంలో రూ.1.25 లక్షల సబ్సిడీని తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం రూ.1.75 లక్షలకు పెంచిందని పేర్కొన్నారు. పెన్షన్లు, ఉచిత విద్యుత్‌, రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పిన ఆయన.. మునుగోడులో మిషన్‌ భగీరథ ద్వారా నీరుతెచ్చి, ఫ్లోరోసిస్‌ను దూరం చేశారన్నారు. కాగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగిన రాజగోపాల్ రెడ్డి, బీజేపీలో చేరడంతో పాటు ఆ పదవికి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నికలు వచ్చిన సంగతి తెలిసిందే! ఈ ఎన్నికల్లో గెలుపొందడం కోసం ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తీవ్రస్థాయిలో శ్రమించాయి. సార్వత్రిక ఎన్నికల రేంజ్‌లో ప్రచారాలు, రోడ్ షోలు నిర్వహించాయి. చివరికి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10 వేల ఓట్లకుపైగా మెజారిటీతో గెలుపొందారు.