NTV Telugu Site icon

MLC Kasireddy: బీఆర్ఎస్ కు కసిరెడ్డి రాజీనామా.. రేవంత్ రెడ్డితో భేటీ

Mlc Kasireddy

Mlc Kasireddy

MLC Kasireddy: బీఆర్ఎస్ కు ఆ పార్టీ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఇవాళ రాజీనామా చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ వైఎస్ చైర్మెన్ బాలాజీసింగ్ కూడ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇవాళ ఉదయమే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ టిక్కెట్టును ఆశించారు కసిరెడ్డి నారాయణ రెడ్డి. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కే కేసీఆర్ టిక్కెట్టును కేటాయించారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కల్వకుర్తి నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు మరోసారి అవకాశం కల్పించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య విభేదాలున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి నారాయణరెడ్డి పోటీ చేయాలని భావించినా అది కుప్పకూలింది. ఆ సమయంలో బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నారాయణరెడ్డికి ఎమ్మెల్సీ పదవి హామీ ఇచ్చారు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నారాయణరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్.. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కసిరెడ్డి నారాయణరెడ్డి భావించినా.. ఆయనకు నిరాశే ఎదురైంది. దీంతో నారాయణరెడ్డి నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

కాంగ్రెస్ పార్టీలో చేరి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలో రెండు రోజుల క్రితం మంత్రి కేటీఆర్‌తో కసిరెడ్డి నారాయణరెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో నారాయణరెడ్డి పార్టీ మార్పుపై ఊహాగానాలకు తెరపడినట్లే. అయితే ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి నివాసంలో కసిరెడ్డి నారాయణరెడ్డి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవితో పాటు కసిరెడ్డి నారాయణరెడ్డి రేవంత్‌ను కలిశారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డిని పోటీకి దింపేందుకు కాంగ్రెస్ అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. టికెట్ కన్ఫర్మ్ కావడంతో నారాయణరెడ్డి రేవంత్‌తో భేటీ అయ్యారని, త్వరలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
MLA Seethakka: విధి లేని పరిస్థితిలోనే కోర్టును ఆశ్రయించా.. ఎమ్మెల్యే సీతక్క హాట్ కామెంట్స్