MLA Raja Singh Arrested Again Hyderabad Police Filed PD Act On Him: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19, ఏప్రిల్ 12న నమోదైన కేసుల్లో భాగంగా.. గురువారం ఉదయం షాహినాయత్, మంగళ్‌హట్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలోనే రాజా సింగ్ ఇంటి వద్ద భారీగా పోలీసుల్ని మోహరించడం, మంగళ్‌హట్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేసి, చర్లపల్లి జైలుకు తరలించారు. వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాజా సింగ్ అరెస్ట్ తరుణంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రాజా సింగ్‌కు మద్దతుగా ఆయన అనుచరులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
తరచూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుండటం వల్లే.. రాజాసింగ్‌పై హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఒక ఎమ్మెల్యేపై తెలంగాణ చరిత్రలో పీడీ యాక్ట్ నమోదు కావడం.. ఇదే మొదటిసారి. అలాగే మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీట్ నమోదైంది. రాజాసింగ్ ప్రసంగాలు మత ఘర్షణలు చోటు చేసుకునేలా ఉన్నాయని.. 22వ తేదీన సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేసిన వీడియో కారణంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని అధికారులు తెలిపారు. మహ్మద్ ప్రవక్తపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని సీపీ ఆనంద్ తెలిపారు. ఈ కేసులో ఈనెల 23న రాజా సింగ్‌ను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. మరోసారి వీడియోలు విడుదల చేస్తానని రాజా సింగ్ ప్రకటించారని చెప్పారు. 2004 నుంచి రాజా సింగ్‌పై మొత్తం 101 క్రిమినల్ కేసులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
అంతకుముందు.. తనకు నోటీసులు ఇవ్వడంపై రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే! ఎప్పుడో నమోదైన కేసులపై, ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేంటని ఆయన మండిపడ్డారు. ఇన్ని రోజులు తెలంగాణ పోలీసులు నిద్రపోతున్నారా? అంటూ ప్రశ్నించారు. తనపై తెలంగాణ పోలీసులు కావాలనే కుట్ర పన్నుతున్నారంటూ ఆరోపణలు చేశారు. కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఓటు వేయకపోతే బుల్‌డోజర్లు వస్తాయని, యోగి ఆదిత్యనాథ్‌కు ఓటేయకపోతే యూపీని వదిలి వెళ్లాల్సి వస్తుందని రాజా సింగ్ వ్యాఖ్యానించారు. దీంతో.. ఈసీ సీరియస్ అయి, ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఏప్రిల్ 12వ తేదీన శ్రీరామనవమిని పురష్కరించుకొని నిర్వహించిన సభలో, రాజా సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని షాహినాత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.