Site icon NTV Telugu

TRS Party: మంత్రి కేటీఆర్ వద్దకు తాండూరు నేతల పంచాయతీ

Mla Rohit Reddy

Mla Rohit Reddy

తాండూరులో రాజకీయం హీటెక్కింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి సీఐ రాజేందర్‌రెడ్డిని అసభ్యకర పదజాలంతో దూషించారని ఆరోపణలు రావడంతో పోలీస్ అధికారుల సంఘం మండిపడుతోంది. ఈ మేరకు ఎమ్మెల్సీ ఆడియో వైరల్ కావడం కలకలం రేపింది. అయితే ఆ ఆడియో తనది కాదని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వాదిస్తున్నారు. ఇది ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కుట్ర అని ఆయన ఆరోపిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారాన్ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌ రెడ్డి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో కేటీఆర్‌తో సమావేశమైన రోహిత్ రెడ్డి.. తాండూరులో ప్రస్తుత పరిస్థితులను వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. తన పక్కన రౌడీషీటర్లు ఎవరూ లేరని, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తానని గతంలో సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు ప్రకటించారని రోహిత్ రెడ్డి గుర్తుచేశారు. పోలీసులను ఎమ్మెల్సీ దూషించడం సరికాదని, ఆడియో తనది కాదని చెప్పడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. తాండూరు నియోజకవర్గంలో తనపై ఓడిపోయిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తనకు పోటీగా భావించడం లేదని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. తన పనితీరు పట్ల అధిష్టానం సంతృప్తిగా ఉందని, తాండూరు నియోజకవర్గంలో ఇసుక దందా అనేదే లేదన్నారు. సీఐ రాజేందర్‌రెడ్డిని తిట్టిన వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని, సీఐతో ఇంకా తాను మాట్లాడలేదన్నారు. సీఐ రాజేందర్‌రెడ్డికే తన పూర్తి మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు.

 

 

 

Exit mobile version