Site icon NTV Telugu

Minister KTR: టాలెంట్ ఎవడి అబ్బ సొత్తు కాదు

Ktr Jntu Speech

Ktr Jntu Speech

Minister KTR Speech To JNTR Students On Talent: టాలెంట్ ఎవడి అబ్బ సొత్తు కాదని, దేవుడు ప్రతి ఒక్కరికీ మెదడిని సమానంగా ఇచ్చాడని, దాన్ని ఎలా పదును పెడతామన్నది మన చేతిలో మాత్రమే ఉందని.. హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థులను ఉద్దేశించి ఇచ్చిన ప్రసంగంలో మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే.. మన దేశంలో ఒక పాడు సంస్కృతి ఉందని, చిన్నప్పుడు స్కూల్‌లో చదువుతున్నప్పటి నుంచే పెద్ద పెద్ద ఆలోచనలు చేయొద్దని మనకు చెప్తుంటారన్నారు. ఇంజనీర్ లేదా డాక్టర్ అవ్వాలన్న లక్ష్యంతోనే చదువుకోవాలని, లేకపోతే మూడో ఆప్షన్ కింద లాయర్ అవ్వమని హితబోధనలు చేస్తుంటారని చెప్పారు. అంతకుమించి ఎక్కువ ఆలోచనలు పెట్టుకోవద్దని, ఎక్కువగా ఆలోచిస్తే బోల్తా పడతావని అతి చిన్న వయస్సు ఉన్నప్పటి నుంచే హెచ్చరిస్తుంటారని పేర్కొన్నారు. ఉద్యోగం సంపాదించడాన్నే లక్ష్యంగా పెట్టుకునేలా సమాజం మనల్ని తయారు చేస్తుందని తెలిపారు.

అందుకే ఉద్యోగం సంపాదించ్న విషయంపై మీదే దృష్టి పెడతామని, అంతకుమించి ఎదగలేక పోతున్నామని కేటీఆర్ చెప్పారు. ఆ చట్రం నుంచి బయటకొచ్చి, మనమెందుకు సంస్థలు పెట్టకూడదన్న కసితో పావులు కదపాలని మంత్రి పిలుపునిచ్చారు. ఒకరి కింద పని చేయడం కాదు, మనమే పదిమందికి పనిచ్చేలా ఎదగాలని ఉత్సాహం నింపారు. గూగుల్, ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటివి బ్రహ్మ పదార్థాలో, రాకెట్ సైన్సో కాదని.. మనలోనూ ఒక స్థాయికి ఎదగాలన్న సంకల్పం ఉంటే, అలాంటి వాటిని మరెన్నో సృష్టించవచ్చని సూచించారు. అదే వేదిక మీదున్న సైయంట్ (Cyient) వ్యవస్థాపకుడు మోహన్ రెడ్డిని ఉదాహరణగా చూపుతూ.. ఆయన ఒక సంస్థ పెట్టి 20 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగినప్పుడు, మీలో (జేఎన్‌టీయూలో ఉన్న విద్యార్థుల్ని చూపుతూ) నుంచి 20 నుంచి 30 మంది దాకా మోహన్ రెడ్డిలు రాలేరా? అని ప్రశ్నించారు.

ఆరోజుల్లో మోహన్ రెడ్డి ఒక సంస్థ పెట్టినప్పుడు, ఆయన్ను వెనకుండా నడిపించడానికి మద్దతుగా ఎవరూ లేరు. ఎలాంటి ప్లాట్‌ఫామ్ కూడా లేదు. కానీ, ఈరోజు టీ-హబ్, వీ-హబ్‌లతో పాటు మరెన్నో ఇన్స్‌టిట్యూషన్స్ ఉన్నాయని.. ఇవన్నీ రెడీమేడ్ ప్లాట్‌ఫామ్స్ అని, మీ దగ్గర ఒక ఆలోచన ఉంటే ఈ ప్రభుత్వ రంగ ఇన్స్‌టిట్యూషన్స్ వద్దకు వచ్చి తెలియజేయండని పిలుపునిచ్చారు. మేము మీకు పూర్తిగా సహకారం అందించడంతో పాటు నిధుల మార్గాల్ని చూపిస్తామని హామీ ఇచ్చారు. ‘అరటి పండు మీ చేతిలో పెడతాం, ఒలిచి తినే బాధ్యత మీదే’ అని తెలిపారు. ఇన్ని సహాయ, సహాకారాలు మార్గాలు ఉన్నప్పుడు.. దాన్ని వినియోగించుకోకపోతే, ఏదైనా సాధించగలనన్న తపన ఉండి కూడా ముందడుగు వేయకపోతే, జేఎన్‌టీయూని, ఇతర కాలేజీలకు తేడా ఏమీ ఉండదని చెప్పారు. ఉద్యోగం కోసం వెంపర్లాడటం కాదు, వ్యవస్థాపకులుగా ఎదగాలన్న లక్ష్యం పెట్టుకోమని కేటీఆర్ సూచించారు.

Exit mobile version