Minister KTR Meeting With VRA Representatives: తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజుల నుంచి ఆందోళన చేపట్టిన వీఆర్ఏలతో మంత్రి కేటీఆర్ తాజాగా సమావేశం అయ్యారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్న ఆయన.. వీఆర్ఏలకు ఇచ్చిన హామీల అమలుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రభుత్వం, వీఆర్ఏలు వేర్వేరు కాదని.. త్వరలోనే వీఆర్ఏల సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఆందోళనలు విరమించాలని కోరారు. ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు మంత్రి కేటీఆర్‌కు వీఆర్ఏ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని తాము మంత్రిని కోరామని.. వీఆర్ఏల సమస్య 25 వేల కుటుంబాలతో ముడిపడి ఉందని ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదిలావుండగా.. పేస్కేల్ అమలు చేయడంతో పాటు అర్హులైన వారికి ప్రమోషన్స్ ఇవ్వాలంటూ వీఆర్ఏలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగిన విషయం తెలిసిందే! 15 నెలల క్రితం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన సీఎం కేసీఆర్.. మళ్లీ వాళ్లను తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ, ఇంతవరకూ ఆ హామీ నెరవేర్చకపోవడంతో వీఆర్ఏ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆందోళన బాట పట్టారు. వాళ్లు చేపట్టిన నిరసన మరింత ఉధృతం కాగా.. మంత్రి కేటీఆర్ ఇటీవల స్పందించారు. తాను 17వ తారీఖు తర్వాత ఈ వ్యవహారంపై చర్చిస్తానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. ఈరోజు (సెప్టెంబర్ 20) వీఆర్ఏ ప్రతినిధులతో చర్చించి, వారి సమస్యకు పరిష్కార మార్గం చూపుతామని హామీ ఇచ్చారు. రాబోయే క్యాబినెట్ సమావేశంలో పే స్కేల్, 55 ఏళ్ళు పైబడిన వారికి సర్వీస్ పెన్షన్, కారుణ్య నియామకాలపై నిర్ణయం నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ మాటిచ్చినట్టు తెలిసింది.
