Minister KTR Fires On Releasing Bilkis Bano Convicts: బిల్కిస్ బానోపై అత్యాచారం చేయడం, ఆమెకు సంబంధించిన 7 మంది కుటుంబీకుల్ని చంపిన కేసులో శిక్ష అనుభవిస్తున్న 11 మంది దోషులను విడుదల చేయడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్కిస్ బానో దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంతో.. వ్యవస్థ మీద నమ్మకం పోయిందని మండిపడ్డారు. మహిళలను గౌరవించాలని ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి మోదీ చెప్పిన మాటల్లో నిజాయితీ ఉంటే.. గుజరాత్ ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసి, ఆ దోషుల్ని తిరిగి జైలుకు పంపించాలన్నారు. ఆ రేపిస్టులందరికీ జీవితఖైదు లేదా ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, జువైనల్ జస్టిస్ చట్టానికి సవరణలు చేసి.. రేపిస్టులకు ఏమాత్రం బెయిల్ దొరకకుండా చేయాలని కేటీఆర్ కోరారు.
కాగా.. 2002లో గోద్రా ఘటన తర్వాత చోటుచేసుకున్న బిల్కిస్ బానోపై కొందరు కిరాతకులు సామూహిక అత్యాచారం చేయడంతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడుగుర్ని హత్య చేశారు. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు 2002లో 11 మందికి శిక్ష విధించింది. దోషుల్లో ఒకరు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన తాను ఇప్పటికే 15 ఏళ్లకు పైగా జైలు శిక్షని అనుభవించానని, తన శిక్షను తగ్గించాలని కోరుతూ సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. వాళ్లు నేరం చేసింది గుజరాత్‌లో కాబట్టి, ఆ దోషి దరఖాస్తుని గుజరాత ప్రభుత్వమే పరిశీలించాలని మే 13న సుప్రీం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం ఆదేశాల మేరకు గుజరాత్ ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, 11 మంది దోషులకు శిక్ష నుంచి ఉపశమనం కలిగించాలని సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే దుషుల్ని సోమవారం విడుదల చేశారు.
