NTV Telugu Site icon

Medaram Jatara: మేడారంలో తక్షణ వైద్య సేవలు.. అందుబాటులో 40 బైక్ అంబులెన్స్‎లు

Medaram Bike Ambulance

Medaram Bike Ambulance

Medaram Jatara: వనదేవతల దర్శనం కోసం మేడారం వచ్చే భక్తులకు అవసరమైన వైద్యసేవలు అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. జాతరలో నిరంతర వైద్య సదుపాయం కల్పించాలని ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేయగా.. తాజాగా బైక్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ మహాజాతరలో దాదాపు లక్షన్నర మంది జనం తరలివచ్చే అవకాశం ఉన్నందున అత్యవసర సేవలను అందించేందుకు బైక్ అంబులెన్స్ సేవలను జాతరలో ప్రారంభించారు. ఈ మేరకు శనివారం మేడారంలోని గిరిజన మ్యూజియం ఆవరణలో మంత్రి సీతక్క అధికారులతో కలిసి బైక్ అంబులెన్స్ లను ప్రారంభించారు. మొత్తం 40 బైక్ అంబులెన్స్‌లను ప్రారంభించనున్నారు. వాటిలో దాదాపు 21 రకాల మెడికల్ కిట్ అందుబాటులో ఉంటాయని, వాటితో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి సీతక్క తెలిపారు.

Read also: Bihar : సరస్వతీ పూజలో హింస..42 మంది అరెస్ట్..180మందిపై కేసు

మేడారం జాతరలో ఏటికేడు భక్తుల రద్దీ పెరుగుతోందని, అత్యవసర సమయాల్లో భక్తులకు వైద్యసేవలు అందించేందుకు కొత్త బైక్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. మేడారం జాతరలో భక్తులకు విస్తృతంగా వైద్యసేవలు అందించాలని, పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. డాక్టర్లు దేవుడితో సమానమని, అమ్మ పుడితే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారన్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, అన్ని రకాల వైద్య సదుపాయాలు, మందులు అందుబాటులో ఉండేలా చూడాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు మంత్రి సీతక్క సూచించారు. జాతరకు వచ్చే భక్తులు సమన్వయంతో వనదేవతలను దర్శించుకోవాలని, అత్యవసర సమయాల్లో సేవలు అందించే అంబులెన్సులకు సహకరించాలని కోరారు.

Read also: Hyderabad Traffic Rules: ట్రాఫిక్ రూల్స్ మారుతున్నాయ్.. పట్టుబడ్డారో ముక్కుపిండి వసూలు చేస్తారు

40 బైక్ అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి
మేడారం జాతరకు తరలివస్తున్న భక్తులను దృష్టిలో ఉంచుకుని 40 జీవీకే బైక్‌ అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచినట్లు మెడికల్‌ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ స్పష్టం చేశారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిరంతరం వైద్య సిబ్బంది ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లో గజ ఈతగాళ్లు ఉండేలా చూడాలన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో క్యూలైన్లలో దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు ఓఆర్ ఎస్ ప్యాకెట్లు, పరిష్కారాలు అందించాలని సూచించారు.

50 పడకలతో తాత్కాలిక ఆసుపత్రి
సమ్మక్క సారలమ్మ మహాజాతరకు తరలివచ్చే భక్తులకు వైద్య సేవలందించేందుకు మేడారంలో 50 పడకలతో తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మంత్రి దామోదర రాజనర్సింహ గత నెలలోనే రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ మేరకు మేడారం జాతరలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. మేడారంలోని ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో నిపుణులైన వైద్యులతో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని సూచించారు. మేడారం వెళ్లే మార్గంలో 42 వైద్య శిబిరాలు, జాతర పరిసరాల్లో 30 వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ప్రతి శిబిరంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని, అవసరమైన అన్ని మందులు, ఎమర్జెన్సీ మెడికల్ కిట్‌లను సిద్ధంగా ఉంచాలన్నారు. జాతరలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, వీలైనంత త్వరగా రోగులను వైద్య శిబిరాలు, సమీపంలోని ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్య శిబిరాల్లో చికిత్స అనంతరం ఉన్నత స్థాయి వైద్యం అవసరమైతే ములుగు, ఏటూరునాగారం, పరకాల ఏరియా ఆసుపత్రులకు, వరంగల్ ఎంజీఎంకు తరలించాలని మంత్రి సూచించారు. ఈ మేరకు మేడారం జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Tirumala: భక్తులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచి మే నెల దర్శన టికెట్లు విడుదల