Site icon NTV Telugu

Suresh Missing Mystery: వీడిన సురేష్ మిస్సింగ్ మిస్టరీ.. ఆ భయంతోనే పరార్

Suresh Missing Mystery

Suresh Missing Mystery

Medak Police Solved Suresh Missing Mystery: ఇటీవల మెదక్‌లో ఒక్కసారిగా కంటికి కనిపించకుండా పోయిన సురేష్ అనే యువకుడి మిస్సింగ్ మిస్టరీ వీడింది. మూడు రోజుల పాటు ఎవ్వరి కంట పడకుండా అజ్ఞాతంలో ఉన్న ఈ యువకుడి ఆచూకీని ఈరోజు పోలీసులు కనుగొన్నారు. ఓ అమ్మాయి విషయంలో ఇంట్లో వాళ్లు కొట్టడంతో పాటు పోలీస్ స్టేషన్‌లో వేస్తారన్న భయంతోనే అతడు పారిపోయినట్టు తేలింది. ఈ వివరాలను మెదక్ డీఎస్పీ యాదగిరి రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.

సోమవారం రోజు సురేష్ చందంపేటకు చెందిన ఓ అమ్మాయితో మాట్లాడేందుకు, ఆ ప్రాంతానికి వెళ్లాడు. అయితే.. వీళ్లిద్దరు మాట్లాడుకోవడాన్ని అమ్మాయి తండ్రి గమనించాడు. దీంతో కోపాద్రిక్తుడైన ఆయన, సురేష్‌ని కట్టెతో కొట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కూడా బెదిరించాడు. ఈ ఘటనతో సురేష్ భయబ్రాంతులకు గురయ్యాడు. ఆయన నిజంగానే పోలీసులకు తెలిస్తే, తనతో పాటు కుటుంబం పరువు పోతుందని భయపెట్టాడు. అలా జరిగితే, తన కుటుంబ సభ్యులు తనని చితకబాదుతారని భావించారు. ఆ భయంతో ఇల్లు వదిలి పారిపోవాలని, ఇంకెప్పుడు తిరిగి రాకూడదని నిర్ణయించుకొని, అక్కడి నుంచి పారిపోయాడు.

రాత్రైనా సురేష్ ఇంటికి తిరిగి రాకపోవడంతో.. అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి, పోలీసులు అతడ్ని గాలించేందుకు రంగంలోకి దిగారు. ఎట్టకేలకు గ్రామ శివారులో అతని ఆచూకీ కనుగొని, అదుపులోకి తీసుకున్నారు. పారిపోయిన రోజు, అంటే సోమవారం నాడు సురేష్ చేగుంట పంట పొలాల్లో సమయం గడిపాడు. అనంతరం మంగళవారం తూప్రాన్‌కి వెళ్లిన అతడు.. బుధవారం సొంత గ్రామం కొరవిపల్లి శివారుకి వచ్చాడు. ఈ సమాచారం గురువారం అందడంతో.. అతడ్ని పట్టుకున్నారు. అతడ్ని విచారించిన తర్వాత మిగతా వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ యాదగిరి రెడ్డి తెలిపారు.

Exit mobile version